తెలంగాణలో సంచలనం రేపిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు కీలక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. నిందితులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన బేరసారాలను ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పూసగుచ్చినట్టు వివరించారు. 
తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, నందకిశోర్‌, సింహయాజీపై కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ ఏసీపీ తెలిపారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు. 


బీజేపీలో చేరితో వంద కోట్లు... చేర్చిన వాళ్లకు యాభై కోట్ల పేరుతో ఆఫర్‌ నడిచించదని పోలీసులు చెబుతున్నారు. బీజేపీలో చేరితే వంద కోట్లు ఇప్పిస్తామని రోహిత్‌ రెడ్డికి రామచంద్ర భారతి ఆఫర్ చేసినట్టు పేర్కొన్నారు. దీనికి నంద కిశోర్‌ మధ్యవర్తిత్వం వహించారు. నంద కిశోర్ ఆహ్వానంతోనే  రామచంద్రభారతి, సింహయాజీ ఫామ్‌హస్‌కు వచ్చారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన వారు ఎమ్మెల్యేలతో బేరాలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. 


వచ్చిన మధ్యవర్తులు జరగబోయే పరిణామాలు వివరించారని పేర్కొన్నారు పోలీసులు. బీజేపీలో చేరకపోతే...కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పినట్టు కూడా అందులో తెలిపారు. బీజేపీలో చేరితే కీలక కాంట్రాక్ట్స్‌తోపాటు భారీ మొత్తంలో డబ్బు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామన్నట్టు వివరించారు. ఇదంతా రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.