హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబరు 45 మధ్య ఎప్పుడూ విసుగెత్తించే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ట్రాఫిక్ పోలీసులు కొత్త ఉపాయాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. అందుకోసం భారీ ఎత్తున ట్రాఫిక్ డైవెర్షన్‌లు చేపడుతున్నారు. వాహనాలు ఆగకుండా సులభంగా ముందుకు కదిలేలా ఓ ప్లాన్‌ను ఆలోచించారు. దాన్ని ఒక వారం రోజులు  ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఒకవేళ అది మంచి ఫలితాలు ఇస్తే శాశ్వతంగా అమలు చేస్తారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నుంచి దుర్గం చెరువు మార్గంలో వెళ్లేవారికి ఈ ట్రాఫిక్ డైవెర్షన్‌ లు ఎక్కువగా ఉండనున్నాయి. ట్రాఫిక్ పోలీసులు దీనికి సంబంధించిన మ్యాప్‌ను కూడా విడుదల చేశారు.


జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపునకు వెళ్లాలనుకొనే వాహనదారులు ఆ జంక్షన్ నుంచి రోడ్ నెంబరు 36 మీదుగా (మెట్రో లైను మార్గంలో) నేరుగా వెళ్లిపోవాలి. వారు ఈ రూట్స్ ఉపయోగించి గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు


1. మెట్రో పిల్లర్ నెంబర్ 1650 (క్రీమ్‌స్టోన్ తర్వాత) లెఫ్ట్ తీసుకొని రోడ్ నెంబరు 54 మీదుగా రోడ్ నెంబరు 45కి (కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కిందికి) చేరుకోవచ్చు. అక్కడి నుంచి కుడి వైపునకు తిరిగి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి చేరుకోవచ్చు.


2. క్రోమా తర్వాత ఎడమ వైపునకు తిరిగి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 39 మీదుగా మంగోలియా బేకరీ వద్ద రోడ్ నెంబరు 45కి చేరుకోవచ్చు. Zozoz Pizzeria Restaurant వద్ద యూటర్న్ తీసుకొని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మార్గంలోకి వెళ్లొచ్చు.


రోడ్ నెంబర్ 45 జంక్షన్ వద్ద నో రైట్ టర్న్


ప్రస్తుతం వాహనదారులు అందరూ వెళ్తున్న దారి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ - లెఫ్ట్ టర్న్ - రోడ్ నెంబర్ 45 జంక్షన్ - రైట్ టర్న్ కాగా, ఇకపై ఇక్కడ రైట్ టర్న్ ను మూసేయనున్నారు. జర్నలిస్ట్ కాలనీ జంక్షన్ వద్ద కూడా రైట్ టర్న్ ను అనుమతించరు.


కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కింద నుంచి లేదా ఇనార్బిట్ మాల్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ విషయంలో వాహనదారులను రోడ్ నెంబరు 45 జంక్షన్ వరకూ అనుమతించరు. వారు రోడ్ నెంబరు 54 (హార్ట్ కప్) వద్ద లెఫ్ట్ తీసుకొని రోడ్ నెంబర్ 36పైనున్న ఫ్రీడమ్ పార్క్ మెట్రో పిల్లర్ నెంబర్ 1663 వద్ద యూటర్న్ తీసుకోవాలి. ఇక రోడ్ నెంబర్ 36 పైన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లిపోవచ్చు.


కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చేవారు బీఎన్ఆర్ హిల్స్, ఖాజాగూడ/ఫిల్మ్ నగర్ జంక్షన్ వెళ్లేవారు హార్ట్ కప్ వద్ద యూటర్న్ తీసుకొని, గీతా ఆర్ట్స్ ఆఫీసు/బ్రాడ్ వే వైపు రావాలి. వారు రోడ్ నెంబర్ 51లోకి వెళ్లి పక్షి సర్కిల్ నుంచి న్యాయ విహార్.. ఆ తర్వాత లెఫ్ట్ తీసుకొని బాటా మీదుగా ఫిల్మ్ నగర్ జంక్షన్ చేరుకోవచ్చు.


బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చే వారు ఒరిస్సా ఐలాండ్/కళింగ భవన్/అగ్రసేన్ జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు. అలా వారు రోడ్ నెంబర్ 45 రాకుండా ఉండవచ్చు.


ఫిల్మ్ నగర్/సీవీఆర్ జంక్షన్ నుంచి వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపునకు వెళ్లాలంటే నేరుగా వెళ్లడం కుదరదు. వీరు రోడ్ నెంబర్ 45 జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని హార్ట్ కప్ వరకూ వెళ్లి కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లాలి. 


బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిల్మ్ నగర్ జంక్షన్ మీదుగా రోడ్ నెంబర్ 45 జంక్షన్ కి వచ్చేవారిని నేరుగా ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద అనుమతించరు. వారు ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకొని భారతీయ విద్యాభవన్ వద్ద యూటర్న్ తీసుకొని సీవీఆర్ జంక్షన్ మీదుగా జర్నలిస్టు కాలనీ, రోడ్డు నెంబరు 45 జంక్షన్ కి వెళ్లొచ్చు.


ఫిల్మ్ నగర్ మీదుగా రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్/ఓమేగా హాస్పిటల్ వైపు వెళ్లేవారు ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకోనివ్వరు. వారు సీవీఆర్ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకొని జర్నలిస్ట్ కాలనీ వద్ద యూటర్న్ - ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి నేరుగా రోడ్ నెంబర్ 12 వైపు వెళ్లిపోవచ్చు.