Hyderabad News: కళాశాలల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ లు చేస్తూ... మీకు ఎవరైనా ఫోన్ లు చేసి పిల్లల సీట్ల కోసం డొనేషన్లు కట్టారా అని అడిగితే.. లేదని చెప్పమంటున్నారు. కడ్తున్నామని చెప్పి మీరు ఇబ్బంది పడకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండంటూ చెబుతున్నారు. ఎందుకని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. ఐటీ దాడులు జరుగుతున్నాయి.. కాబట్టి అందరికీ ఫోన్ లు చేసి ఇలా చెప్తున్నట్లు వివరించారు. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కళాశాలలు, ఆయన బంధువుల నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తోంది. కళాశాల్లలో డొనేషన్లపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఇంజినీరింగ్, వైద్య కళాశాలల యాజమాన్యాలు.. తాము డొనేషన్ తీసుకున్న విద్యార్థులకు ఫోన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 


నగర శివారులోని కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ప్రవేశం కోసం ఏకంగా రూ. లక్షల్లో డొనేషన్లు వసూలు చేశాయి. కళాశాల స్థాయి, బ్రాంచిని బట్టి ఆరు లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు తీసుకున్నాయి. కొన్ని ప్రముఖ కళాశాలలు బీటెక్, కంప్యూటర్ సైన్స్ కు 12 నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేశాయి. మిగిలిన ఫీజులన్నీ దీనికి అదనం. ఒకే దఫాగా నగదు రూపంలో వసూలు చేసిన డొనేషన్ మొత్తాలకు పక్కా రసీదులివ్వరు. ఇవన్నీ కళాశాలల లెక్కల్లో కనిపించవు. ఈ క్రమంలోనే కళాశాల యాజమాన్యాయు అప్రమత్తం అయ్యాయి. 


65 బృందాలు సోదాలు.. 


రెండు రోజులుగా జరుగుతున్న సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఐటీ అధికారులతోపాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికిపైగా ఐటీ అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు. కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు.. ఆధారాలు సేకరించామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు తెలుస్తోంది. 


భారీగా నగదు స్వాధీనం..


మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్లకు పైగా నగదు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఐటీ సోదాల్లో రూ.4 కోట్ల 80 లక్షలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్ల 80 లక్షలు, మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఇంటిలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మల్లారెడ్డి బామ్మర్ది కొడుకు సంతోష్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఐటీ శాఖ అధికారులు ఈ విషయం మీద స్పందిస్తూ మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు.  ఇప్పటి వరకు చేసిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈరోజుతో సోదాలు ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది.