Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఏటీఎం కేంద్రంలో బంపర్ ఆఫర్ చోటుచేసుకుంది. 500 కావాలని డ్రా చేస్తే ఆ ఐదు వందల రూపాయలతోపాటు మరో రెండు వేల రూపాయలను ఎక్కువగా అందిస్తోంది. ముందు ఓ వ్యక్తి ఇలా జరగ్గా మరోసారి అలాగే చేశాడు. ఆ తర్వాత విషయాన్ని అక్కడున్న వాళ్లకి చెప్పాడు. ఇలా విషయం స్థానిక ప్రజలందరికీ తెలిసిపోయింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఏటీఎం కేంద్రానికి చేరుకొని డబ్బులు డ్రా చేసే ప్రయత్నం చేశారు. పాతబస్తీలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొహల్‌పురా వెనుక వైపు ఉన్న ఇష్రత్ మహల్‌ లోని ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తింది. పదుల సంఖ్యలో జనాలు అక్కడ గుమిగూడేసరికి పలువురు విషయం తెలుసుకొని మోహన్ పురా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఏటీఎం కేంద్రానికి తాళం వేశారు. ఆపై బ్యాంకు అధికారికి సమాచారం అందించారు. 


అయితే ఇలాంటి సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే పోలీసులు లేదా బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలని కానీ ఇలా డబ్బులు తీసుకోకూడదని పోలీసులు తెలిపారు. ఇలా చేయడం నేరం అని వివరించారు. కొన్నిసార్లు పలు సాంకేతిక లోపాల వల్ల ఇలాంటి తప్పులు జరుగుతాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏటీఎం కేంద్రానికి తాళం వేశామని.. బ్యాంకు అధికారులకు కూడా సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. వారు వచ్చి సమస్యను పరిష్కరించిన తర్వాతే ఏటీఎం కేంద్రాన్ని తెరుస్తారని వివరించారు.