Hyderabad News: హైదరాబాద్ మల్కాజీగిరి బాలుడి కిడ్నాప్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నాప్ కు పాల్పడిన నిందితుల్లో నలుగురు పెద్ద వాళ్లు కాగా.. ఓ మైనర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బాలుడే కిడ్నాప్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. క్రికెట్ బాల్ కొందామని చెప్పి బయటకు తీసుకు వచ్చి మైనర్ బాలుడు.. హర్ష వర్ధన్ ను కారు ఎక్కించాడట. ఆపై కిడ్నాప్ చేసిన మొదటి రోజు బాలుడిని ఆలేరులోని ఓ ఫాం హౌజ్ లో నిందితులు దాచారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నామని చెప్పి ఓ చోట నుంచి మరో చోటుకు కారులో తిప్పారు. హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కడప జిల్లాకు చెందిన శివగా పోలీసులు గుర్తించారు. ఆన్ లైన్ ట్రేడింగ్ లో శివ భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. నష్టాన్ని పూడ్చుకోవడానికి కిడ్నాప్ కు ప్లాన్ చేశాడు. బాలుడి ప్లాన్ కు కడప నుంచి శివ స్కెచ్ వేయడంతో పాటు అక్కడి నుంచే ప్లాన్ ను అమలయ్యేలా చేశాడు. మైనర్ బాలుడితో సహా ఐదుగురు ముఠాగా ఏర్పడి.. కిడ్నాప్ చేశారు. 


36 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు..


అయితే తాము అనుకున్నట్లు కిడ్నాప్ సక్సెక్ అయి డబ్బు చేతికి రాగానే బాలుడు గతం గుర్తులు లేకుండా స్నేహితులతో కలిసి సర్జరీ చేయించాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 8వ తరగతి విద్యార్థి అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. మల్కాజీగిరిలో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు హర్ష వర్ధన్ ఈనెల 16వ తేదీన కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 36 గంటల్లో కేసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర వివరాల ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారులో బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులను రామన్నగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.


ఇదే ఏడాది జనవరిలోనూ వరంగల్ లో బాలిక కిడ్నాప్


వరంగల్ లో  బాలిక కిడ్నాప్ కలకలం రేగింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేంద్ర నగర్ లోని 4వ తరగతి చదువుతున్న ముతుల్ అనే బాలిక కొబ్బరి నూనె తెచ్చేందుకు కిరాణా షాపు వెళ్లగా, అక్కడ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్చీఫ్ లో మత్తుమందు పెట్టి బాలికను కిడ్నాప్ చేశారు. బాలికను ఓ వ్యాన్లో తీసుకెళ్తున్న క్రమంలో వరంగల్ గణపతి ఇంజినీరింగ్ కళాశాల వద్ద దుండగులు వ్యాన్ ఆపి టీ తాగుతుండగా, బాలికకు స్పృహ రావడంతో వాళ్ల చెర నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. టాటా ఏస్ లో వచ్చిన ముగ్గురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై  బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  


"పాప షాపునకు వెళ్లింది. అమ్మాయి రోడ్డు దాటేవరకూ అక్కడే నిలబడ్డాను.  పది నిమిషాలు అయినా ఇంకా పాప రాలేదు. మా అబ్బాయిని పంపి షాపు వద్ద అడిగితే ఎవరు రాలేదని చెప్పారు. ఈ విషయాన్ని నా భర్తకు చెప్పాను. బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని అక్కడ కూడా చూశాం, కానీ అక్కడికీ వెళ్లలేదు. ఇంతలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాను. పాప వరంగల్ లో ఉందని ఫోన్ వచ్చింది. అక్కడికి ఎలా వచ్చిందని అడిగితే ఎవరో వ్యాన్ లో తీసుకొచ్చారని బాలిక చెప్పింది. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేశాం. "- బాలిక తల్లి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial