Telangana Assembly Elections 2023: 2023 తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly Elections 2023) ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగనున్నాయి. ఇప్పటికే పార్టీ రాజకీయ వ్యూహాల్లో మునిగిపోయాయి. ఇప్పుడు అధికారులు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అక్టోబర్‌ మొదటి పక్షంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి ఎన్నికల యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. 


అధికారుల కసరత్తు 


ఎన్నికలకు ముందు అధికార యంత్రాంగం భారీగాన్నే సన్నద్దం కావాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్‌ల ఏర్పాటు, ఓటర్ల జాబితా రెడీ చేయడం, నియోజకవర్గాల వారీగా ఆర్‌వోలను నియమకం. సమస్యాత్మ ప్రాంతాలను గుర్తించి అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఓకే చెప్పి వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 


ఈసారి అదనపు కలెక్టర్లకి బాధ్యతలు


ఈసారి అదనపు జిల్లా కలెక్టర్లకి కూడా బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. 74 మంది డిప్యూటీ కలెక్టర్లు, 14 మంది డిప్యూటీ కమిషనర్లు, 31 మంది అదనపు కలెక్టర్ల లిస్ట్‌ను రెడీ చేసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండల తహసిల్దార్లకు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా విధులు అలాట్ చేయనున్నారు. వీళ్లు నామినేషన్లు స్వీకరించడం, పోలింగ్ సామగ్రిని సరఫరాల చేయడం, పోలింగ్‌బూత్‌ల ఏర్పాటు, ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు రెడీ చేస్తారు. 


అక్టోబర్ 4 తర్వాతే షెడ్యూల్


అక్టోబర్‌ 4న ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు. ఆ తర్వాతే షెడ్యూల్‌ వస్తుందని అధికారులు చెబుతున్నారు. 2018లో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా... 2018 సెప్టెంబర్‌ 6 న ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు సీఎం కేసీఆర్. అప్పటికి ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ముందస్తుకు వెళ్లారు. 


గత ఎన్నికల్లో సెప్టెంబర్‌లో నోటిఫికేషన్


ఆ సమయంలోనే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నందున వాటితోపాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. అక్టోబర్‌ 6న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. నవంబర్‌ 12న నోటిఫికేషన్‌ జారీ చేశారు. డిసెంబర్‌ 7న పోలింగ్ నిర్వహించారు. 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈసారి కూడా ఆ నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, రాజస్థాన్‌కు తెలంగాణతోపాటు ఎన్నికలు జరగబోతున్నాయి. 


అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన కేసీఆర్!


2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌.. ప్రభుత్వ రద్దు ప్రకటనతోపాటే ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేశారు. అప్పుడు ఎన్నికలకు సుమారు మూడు నెలల ముందే ఒకేసారి 105 మంది జాబితాను విడుదల చేయడం సంచలనం సృష్టించింది. అదే తరహాలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేలా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం బీఆర్‌ఎస్‌లో తీవ్రపోటీ నెలకొనడం, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో పనిమంతులకే తిరిగి టికెట్‌ దక్కుతుందని ఇప్పటికే స్పష్టతనిచ్చారు. చివరి నిమిషంలో టిక్కెట్లు ఖరారు చేస్తే అసంతృప్తి ప్రభావం చూపిస్తుందని  మూడు నెలల ముందుగానే  చెబితే.. వెళ్లేవాళ్లు వెళ్తారని ఉండేవాళ్లు ఉంటారని అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. 




Join Us on Telegram: https://t.me/abpdesamofficial