Hyderabad News: కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపారులు, సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎలాగోలా తమ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలని కోరుకుంటారు. అందులో తప్పేం లేదు. కానీ నిబంధనలు ఉల్లఘించి చేసే ఏ పనైనా శిక్షార్హమే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జోరా నైట్ క్లబ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ ఈవెంట్ జరిపింది. జంగిల్ పార్టీ పేరుతో జరిపిన ఈ ఈవెంట్ లో ఆ యాజమాన్యం చేసిన పనే ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహాన్ని, పోలీసు కేసులను ఎదుర్కొంటోంది. 


జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని జోరా నైట్ క్లబ్(Xora Night Club) మే 28 ఆదివారం రోజు కస్టమర్ల కోసం వైల్డ్ జంగిల్ పార్టీ పేరుతో ఓ ఈవెంట్ జరిపింది. ఇందుకోసం వన్యప్రాణులను తీసుకొచ్చింది. క్లబ్ ప్రాంగణంలో కింగ్ కోబ్రా, లిజర్డ్, వైల్డ్ క్యాట్ లాంటి జంతువులను తీసుకు వచ్చింది క్లబ్ యాజమాన్యం. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పార్టీల కోసం వన్యప్రాణులను హింసిస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా జంతు హింస కిందకే వస్తుందని క్లబ్ యజమానులను, నిర్వాహకులను వెంటనే జైలులో వేయాలని డిమాండ్ చేస్తారు. ఇందుకు సంబంధించి ఫోటోలను, వీడియోలను ఆశిష్ చౌదరి అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 










స్పందించిన అరవింద్ కుమార్


ఆశిష్ చౌదరి ట్వీట్ పై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్(MA & UD) స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పందించారు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ, సీపీకి తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇటువంటి చర్యలు సిగ్గు చేటు అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. 


నైట్ క్లబ్ లో వన్యప్రాణుల ప్రదర్శనపై అటవీ అధికారులతో కలిసి విచారణ చేస్తున్నామని జూబ్లీహిల్స్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నైట్ క్లబ్ యజమానిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.


 






మేమేం తప్పు చేయలేదు: జోరా


సోషల్ మీడియాలో వస్తున్న స్పందనపై జోరా నైట్ క్లబ్ యాజమాన్యం స్పందించింది. తాము నిర్వహించిన ఈవెంట్ లో జంతువులను చట్టబద్ధంగానే ప్రదర్శించినట్లు, అందుకు కావాల్సిన అనుమతులు అన్నీ తీసుకున్నట్లు జోరా క్లబ్ స్పష్టం చేసింది. వైల్డ్ జంగిల్ పార్టీలో కనిపించిన వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా చూసుకున్నట్లు తెలిపింది. అవసరమైన అన్ని భద్రతా చర్యల మధ్యే జంతు ప్రదర్శన నిర్వహించినట్లు జోరా యాజమాన్యం చెప్పుకొచ్చింది.