Rains in Telangana: రోహిణి కార్తె కావడంతో ఎండ, వడగాల్పుల తీవ్రత ఉన్నప్పటికీ ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోందని.. దీంతో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి, ఖమ్మ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్లు కురిసే అవకాశం ఉండగా.. ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. బుధవారం నుంచి శనివారం వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. 










తెలంగాణలో ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన జిల్లాలు


హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల్, మెదక్, మల్కాజిగిరి, ములుగు, నారాయణ్ పేట, నిమాజాబాద్, పెద్దపల్లి, రాజన్న సరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి


నిన్న రాత్రి నుంచి వానలు..!


తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం పెద్దపల్లి, జోగులాంబ గద్వాల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వాన పడింది. అలాగే వరంగల్ లోనూ భారీ వర్షం కురిసినట్లు సమాచారం. భాగ్యనగరంలో ఈరోజు ఉదయం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, కామారెడ్డి జిల్లాలోనూ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ పలు జిల్లాలకు వర్ష సూచన చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఎల్బీనగర్, కొత్తపేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, నాంపల్లి,లక్డీకపూల్, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అంబర్‌పేట ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది.






ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుమురు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణతోపాటు ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా 43 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదుకు ఛాన్స్ ఉంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో అక్కడక్కడా పిడుగులు పడొచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తోంది.


మరోవైపు వర్షాలతో పలు చోట్ల మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లలో అధికారుల అలసత్వంతో తాము చాలా నష్టపోతున్నట్లు చెబుతున్నారు.