మార్గదర్శి కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్‌కు చెందిన రామోజీరావు   ఆస్తులను అటాచ్ చేసేందుకు సీఐడీ ఏపీ హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఖాతాదారులకు డబ్బులు చెల్లించే స్థితిలో మార్గదర్శి లేదని అందుకే ముందు జాగ్రత్త చర్యగా ప్రజాప్రయోజనాలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది. 


రామోజీరావుకు చెందిన రూ. 793.50 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసేందుకు ఏపీ సీఐడీకి అనుమతి లభించింది. నగదు, బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న నిధులు, మ్యూచువల్ ఫండ్స్‌లో డిపాజిట్లను అటాచ్ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ సీఐడీ ఓ ప్రకటనలో తెలిపింది. వడ్డీల పేరుతో డిపాజిట్లు సేకరించడం, నిధులు మళ్లించడం, ఐటీ చట్ట ఉల్లంఘనలకు మార్గదర్శి పాల్పడిందని అభియోగాలు మోపింది. ఏపీలో 37 బ్రాంచ్‌ల్లో మార్గదర్శి వ్యాపారాలు చేస్తోంది. 1989 చిట్స్ గ్రూప్స్ ఉన్నాయి. తెలంగాణలో 2,316 గ్రూప్స్‌ నడుస్తున్నాయి అని సీఐడీ పేర్కొంది. 


మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆ సంస్థలో సీఐడీ తనిఖీలు చేసింది. కేసులు నమోదు చేసింది. మార్గదర్శి కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్‌గా పేర్కొంది. ఫోర్‌మెన్‌, ఆడిటర్లతో కలిసి కుట్రకు పాల్పడినట్టు సీఐడీ తెలిపింది. చిట్స్‌ద్వారా సేకరించిన సొమ్మును హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆఫీస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. 


అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో పలు మార్లు ఆ సంస్థ కార్యాలయాల్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ 120(బి), 409, 420, 477(ఏ), రెడ్‌ విత 34కింద ఏడు ఎఫ్‌ఐఆర్లు నమోదు చేసింది. ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఇన్‌ ఫైనాన్సియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1999లో సెక్షన్‌ 5తోపాటు చిట్‌ ఫండ్‌ యాక్ట్‌ 1982లోని 76,79సెక్షన్ల ప్రకారం సోదాలు చేసింది. మార్గదర్శి మేనేజర్లను అరెస్టు చేసింది. రామోజీరావు, శైలజాకిరణ్‌ను ప్రశ్నించింది.