Allegations on Jani Master: యువతిని లైంగికంగా వేధించారని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ ఆచూకీ తెలియడం లేదు. ఆయనపై కేసు ప్రస్తుతం హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండగా.. ఆ పోలీసులు జానీ మాస్టర్ కోసం వెతుకుతున్నారు. హైదరాబాద్‌లో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక, ఆయన సొంతూరు అయిన నెల్లూరులో ఉన్నట్లు ప్రచారం జరగడంతో నార్సింగి పోలీసులు నెల్లూరు పోలీసులను కూడా సంప్రదించారు. 


ఆయన పేరుపై నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. అయితే, జానీ మాస్టర్ ఎవరికీ టచ్ లో లేరని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉందని సమాచారం. విచారణకు రావాలని, వీలైనంత త్వరగా తమ ముందు హాజారుకావాలని నోటిసుల్లో పోలీసులు ఆదేశించారు. ఆచూకీ కనిపెట్టి ఒకటి లేదా రెండు రోజుల్లో అరెస్ట్ చేయనున్నట్లుగా చెబుతున్నారు.


ఫిల్మ్ ఛాంబర్ సీరియస్
ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా కాస్త గట్టిగానే స్పందించింది. తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 2018లో ఒక ప్యానెల్‌ను నియమించింది. సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ రెడ్రెసెల్‌ ప్యానెల్‌ పేరుతో (లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌) కొంత మంది సినీ ప్రముఖులు సభ్యులుగా ఈ ప్యానెల్ ను ప్రారంభించారు. ఈ ప్యానెల్‌ ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారంపై విచారణ జరుపుతోంది. ఈ ప్యానెల్‌కు సెక్రటరీ, కన్వీనర్‌గా నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ఉన్నారు. ఛైర్ పర్సన్ గా ఝాన్సి ఉన్నారు. వీరు మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసులో బాధితురాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇరు పక్షాల వాంగ్మూలాలు తమ వద్ద ఉన్నాయని, దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు.


2017లో పరిచయం
21 ఏళ్ల వయసున్న యువతి జానీ మాస్టర్ పైన లైంగికపరమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదులోని ఆరోపణల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ అమ్మాయి 2017లో ఓ డాన్స్ షోలో పాల్గొన్నది. అదే సమయంలో ఆ షోకి జడ్జిగా జానీ మాస్టర్ ఉన్నారు. దీంతో జానీ మాస్టర్ ఆమె ప్రతిభ చూసి ఆమెకు సినిమాల్లో తన వద్ద డాన్స్ అసిస్టెంట్ గా ఛాన్స్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలా 2019 నుంచి ఆ యువతి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తూ ఉంది. అప్పటికి ఆమె మైనర్. అయితే మొదటి నుంచి తనని లైంగికంగా, మానసికంగా చాలా రోజుల నుంచి మాస్టర్ వేధిస్తున్నారని బాధితురాలు తాజాగా ఆరోపణలు చేస్తోంది. ఒక షో కోసం ముంబయి వెళ్లిన సమయంలో హోటల్ రూంలో తనని బలవంతం చేసి లైంగికదాడి కూడా చేశారని బాధితురాలు ఆరోపణలు చేస్తోంది.


ఓసారి క్యారవాన్ లో, నార్సింగిలోనూ తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు మాస్టర్ వేధించారని సదరు యువతి తన గోడు వెళ్లబోసుకుంది. జానీ మాస్టర్ భార్య కూడా తనను వేధింపులకు గురి చేసేదని బాధితురాలు సంచలన ఆరోపణలు చేయడం మరింత సంచలనంగా మారింది. తనని మతం మార్చుకుని, అతడిని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. ఆయనపై ఈ స్థాయిలో ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీని తీసేశారు.