Nandishwar Goud: తెలంగాణ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసేందుకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు చాలా మంది తమ నామినేషన్లను సమర్పించారు. మిగిలిన వారు శుక్రవారం నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు ఒక్కొక్కరు ఒక్కో తరహాలో ర్యాలీలు, బల ప్రదర్శనలు చేపడుతున్నారు.
జేసీబీలతో ర్యాలీ నిర్వహించిన నందీశ్వర్ గౌడ్
నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియలో భాగంగా రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకునేందుకు కొందరు అభ్యర్థులు వినూత్న రూపంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. పటాన్‌చెరు (Patancheru) బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ (Nandishwar Goud) సరికొత్తగా నామినేషన్ దాఖలు చేశారు. అన్ని పార్టీల నేతల మాదిరిగా కాకుండా వినూత్నంగా ఏకంగా జేసీబీ(JCB)లతో ర్యాలీని నిర్వహించారు. అనంతరం నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
అభిమానులు, కార్యకర్తలు, మంది మార్బలంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు నేతలు తరలి వెళ్లారు. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గురువారం తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ తరపున అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గురువారం (నవంబరు 9) నామినేషన్ వేయడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
నియోజకవర్గంలో ఒకేసారి రెండు పార్టీలు భారీ ర్యాలీ చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీగా వెళుతున్న సమయంలో రెండు పార్టీలు ఎదురుపడ్డాయి. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లతో కొట్టుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ నేతలపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్‌ఎస్ నేతలపై విసురుకున్నారు. ఈ ఘటనలో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు రెండు పార్టీల నేతలపై లాఠీచార్జీ చేశారు. పరిస్థితి అదుపుచేయడానికి యత్నించారు. ఈ ఘటనపై మల్లు రవి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల దాడులు అప్రజాస్వామికం అని అన్నారు.
రేపటితో ముగియనున్న గడువు
నామినేషన్లకు శుక్రవారంతో గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థులు గురువారం పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్ల దాఖలులో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు కొందరు రోడ్‌షోలు నిర్వహించి.. తమ నామినేషన్లు వేస్తున్నారు. మరికొందరు బ్యాండ్‌తో ప్రచారం చేస్తూ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి తమ అనుచరులతో నామినేషన్ పత్రాలు పంపిస్తున్నారు. కొందరు నేతలు పూజలు నిర్వహించి.. శుభ ఘడియలు చూసుకుని ముఖ్యనేతలను తమ వెంట తీసుకు వెళ్లి నామినేషన్లు వేస్తున్నారు.