Hyderabad Latest News: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. భారీగా అభిమానులు, కార్యకర్తలు మందిమార్బలంతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad News) శివారులోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు రాళ్ల దాడి చేసుకున్నారు. 


ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam News) నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ (BRS News) తరపున అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గురువారం (నవంబరు 9) నామినేషన్‌ వేయడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నియోజకవర్గంలో ఒకేసారి రెండు పార్టీలు భారీ ర్యాలీ చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీగా వెళుతున్న సమయంలో రెండు పార్టీలు ఎదురుపడ్డాయి. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లతో కొట్టుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ నేతలపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్‌ఎస్ నేతలపై విసురుకున్నారు. ఈ ఘటనలో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు రెండు పార్టీల నేతలపై లాఠీచార్జీ చేశారు. పరిస్థితి అదుపుచేయడానికి యత్నించారు.






కుత్బుల్లాపూర్‌లో నామినేషన్లు దాఖలు


కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ప్రత్యేకపూజల అనంతరం వేలాదిమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సురారంలోని కట్టమైసమ్మ ఆలయం నుంచి జీహెచ్ఎంసీ వరకు ప్రతి కార్యకర్త చేతిలో గులాబీ జెండా, మెడలో గులాబీ కండువతో పండుగ వాతవరణంలో భారీ ర్యాలీని నిర్వహించి మరో సెట్ నామినేషన్ ను వేశారు.


ఇదే నియోజకవర్గంలో డీజే సౌండ్ లతో, బ్యాండ్ బాజాలతో మారుమోగేలా వేలాది మంది కార్యకర్తల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి కోలన్ హనుమంత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లిలోని జీతే పీర్ దర్గాను సతీసమేతంగా దర్శించుకొని కొలన్ హన్మంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్లతో పోతురాజుల విన్యాసాలు ఏర్పాటు చేశారు. బోనాలతో భారీగా ర్యాలీగా వేలాదిమంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.


తగిన మూల్యం చెల్లిస్తాం - మల్లురవి


ఈ ఘటనపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల దాడులు అప్రజాస్వామికం అని అన్నారు. ఓటమి భయంతోనే ఈ దాడులు చేస్తున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడులు చేయడం, అశాంతిని నెలకొల్పడం కాంగ్రెస్ సిద్ధాంతం కాదని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో ఉండాలని సూచించారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, కాంగ్రెస్ వాళ్లపై దాడులు చేసిన వారికి తగిన మూల్యం చెల్లిస్తామని మల్లు రవి హెచ్చరించారు.