Hyderabad News: రాజస్థాన్ లోని జైపూర్ నుంచి ముంబయి వెళ్తున్న జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్పులు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఆర్పీఎఫ్ ఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. వారిలో హైదరాబాద్ లోని నాంపల్లి బజార్ ఘాట్ కు చెందిన సయ్యద్ సఫియుల్లా ఉన్నట్లు ఎంపీ అసదుద్దీన్ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పారు. సఫియుల్లా కుటుంబాన్ని ఆదుకోవాలని అసదుద్దీన్ రాష్ట్ర సర్కారును కోరారు.














అసలేం జరిగిందంటే..?


జైపూర్ ఎక్స్ ప్రెస్ మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్పులు జరిపాడు. చేతన్ మొదట సీనియర్ అధికారి ఏఎస్సై టికా రామ్ మీనాను కాల్పి చంపాడు. ఆ తర్వాత మరో బోగీలోకి వెళ్లి మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చాడు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. కాల్పుల అనంతరం దహసిర్ స్టేషన్ వద్ద నిందితుడు రైలు నుంచి దూకేశాడు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.