Hyderabad News: చికెన్ పకోడీలో కారం ఎక్కువైంది అని చెప్పినందుకు వినియోగదారుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడో హోటల్ నిర్వాహకుడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కే.పీ.హెచ్.బీ కాలనీలో నివసించే నాగార్జున గత రాత్రి 9వ ఫేజులోని జే.ఎస్ చికెన్ పకోడీ సెంటర్ కు వెళ్లాడు. తనకు నచ్చిన ఆర్డర్ ఇచ్చాడు. రాగానే ఆవురావురుమంటూ తినాలనుకున్నాడు. ఓ ముక్క తీసి నోట్లో పెట్టుకోగానే కారం నషాలానికి అంటింది. దీంతో వెంటనే నాగార్జున.. చికెన్ పకోడీలో కారం ఎక్కువ అయిందని హోటల్ నిర్వాహకుడికి చెప్పాడు.


దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హోటల్ నిర్వాహకుడు జీవన్.. తింటే తిను లేదంటే వెళ్లిపో అంటూ దూషించాడు. కారం ఎక్కువైంది అన్నందుకే ఇలా మాట్లాడతావా అంటూ నాగార్జున వాదనకు దిగాడు. దీంతో జీవన్.. కత్తితో దాడికి దిగాడు. ఈక్రమంలోనే నాగార్జునను తీసుకెళ్లేందుకు వచ్చిన ఆయన స్నేహితుడు ప్రణీత్ వారిని ఆపేందుకు వెళ్లాడు. దురదృష్టవశాత్తు ప్రణీత్ చేయి తెగింది. తీవ్ర గాయం అయింది. విషయం గుర్తించిన స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ప్రణీత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


గతంలో కూడా ఇలాంటి ఘటన


రోజువారీ కూలీ కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన ఓ వ్యక్తిపై ఓ రెస్టారెంట్ సిబ్బంది గతంలో అమానుషంగా ప్రవర్తించారు. అతను దొంగ అని పొరబడడం వల్ల తీరని నష్టం కలిగింది. ఆకలితో అలమటిస్తున్న ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి చేయడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన కూడా కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన రాజేష్‌ అనే 32 ఏళ్ల వ్యక్తి, భార్యా, పిల్లలతో కలిసి మాదాపూర్‌ సమీపంలోని ఓ బస్తీలో ఉంటున్నాడు. ఇతను బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.


ఇతను 2021 డిసెంబర్ నెలలో ఓ రోజు రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చే సమయంలో జేఎన్‌టీయూహెచ్‌ మెట్రో స్టేషన్‌ పక్కనే ఉన్న మొఘల్స్‌ ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ సెల్లర్‌లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ రెస్టారెంట్‌ మేనేజర్‌ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండడంతో ఇతను కూడా వెళ్లాడు. అక్కడ సిబ్బంది కలిసి పార్టీ చేసుకుంటున్నారు. వాళ్లు తినగా మిగిలింది తనకు ఇవ్వాలంటూ రాజేశ్‌ వాళ్లను వేడుకున్నాడు. కానీ, మానవత్వం మరిచిపోయారు. అతను దొంగగా భావించి అందరూ మూకుమ్మడి దాడి చేశారు. అంతా చితకబాది వెళ్లిపోయారు. రాత్రంతా అక్కడే స్పృహలో లేకుండా పడిపోయి ఉన్న రాజేష్‌ను.. గురువారం ఉదయం హోటల్‌ సిబ్బంది గుర్తించారు. ఒడిషాలోని రాజేష్‌ తండ్రికి సమచారమివ్వగా అతను భార్య సత్యభామకు తెలపడంతో ఆమె వెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వెళ్లిన కాసేపటికే రాజేష్‌ చనిపోయాడు. సత్యభామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హోటల్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. రాజేష్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.