అప్పుడే పుట్టిన పసికందులను, రోజులు, నెలల వయసు ఉన్న పసికందులను కుటుంబసభ్యులు వదిలేస్తున్న ఘటనలు ఎక్కడో చోట వింటుంటాం. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి రోజుల పసికందును వదిలివెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్‌మెంట్‌లో పసికందును కింద పడేసి వెళ్లిపోగా, ఏడుపు విన్న స్థానికులు గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కి చెందిన ఎస్ఐ సాయికుమార్ తక్షణమే ఆ అపార్ట్‌మెంట్ కు చేరుకుని గాయాలు పాలైన రోజుల పసికందును అక్కున చేర్చుకున్నారు. వైద్యం కోసం హాస్పిటల్‌కు పసికందును తరలించేందుకు పరుగులు పెట్టి మానవత్వం చాటుకున్నారు.
మానవత్వం చాటుకున్న ఎస్ఐ సాయికుమార్..
కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్ లో ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు రోజుల పసికందును ఆదివారం వదిలేసి వెళ్లారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. శిశువును గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు పసికందు ప్రాణాలతో ఉందని, త్వరగా రావాలని పోలీసులను కోరారు. కుషాయిగూడ పీఎస్ లో సేవలు అందిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ సాయికుమార్ హుటాహుటీన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. పసికందును స్వయంగా తన చేతుల్లోకి తీసుకున్న ఎస్ఐ సాయికుమార్ వైద్య చికిత్స త్వరగా అందించేందుకు పరుగులు పెట్టడం చూసిన వారిని సైతం కలచివేసింది.
అదివరకే అపార్ట్‌మెంట్ వాసులు 108కి సైతం సమాచారం అందించారు. అంబులెన్స్ కంటే ముందుగా కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్ క్షణాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పసికందును చూసి చలించిపోయిన ఎస్ఐ చిన్నారికి అత్యవసరంగా వైద్యం అందించాలని రోడ్లపై పరుగులు పెట్టారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసికందుకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ రోజుల పసికందును మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. రోజుల చిన్నారి, అందులోనూ ఎందుకు పసికందును వదిలేశారోనన్న అనుమానాలు స్థానికులు వ్యక్తం చేశారు. అయితే పసికందు ప్రాణం కాపాడేందుకు పరుగులు పెట్టి, ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి ఎస్ఐ సాయికుమార్ మానవత్వాన్ని చాటుకోవడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. పక్కన అపార్ట్‌మెంట్ నుంచి పసికందును ఎవరో పడేశారని, చిన్నారి పడటంతో శబ్ధం వచ్చిందని స్థానికులు పోలీసులకు తెలిపారు.
గత నెలలో కరెంట్ షాక్ నుంచి హీరోలా కాపాడిన ట్రాఫిక్ పోలీస్ !
కరెంట్ షాక్ కొట్టిన ఓ వ్యక్తికి ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు. అనంతరం సీపీఆర్ చేసి ఆ వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు. సీపీఆర్ నిర్వహించడంతో ఆ బాధితుడు స్పృహ లోకి వచ్చాడు. అనంతరం ఆ వ్యక్తిని అంబులెన్స్ 108లో ఉస్మానియా ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఈ ఘటన బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..
ఓ వ్యక్తి అప్పటికే బాగా మద్యం సేవించి ఉన్నాడు. మంగళవారం సాయంత్రం నగరంలోని బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్ సమీపంలో తిరుగుతున్నాడు. మద్యం మత్తులో రోడ్డు పక్కన ఉన్న ఓ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ బాక్సు తెరిచి అందులో చేతులు పెట్టాడు మందుబాబు. పవర్ సప్లై ఉండటం, వైర్లను పట్టుకోవడంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి కరెంట్ షాక్ కొట్టింది. విద్యుత్ షాక్‌కు గురై మందుబాబు విలవిల్లాడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్ ఇది గమనించారు. కరెంట్ షాక్‌తో విలవిల్లాడుతున్న వ్యక్తిని చాకచక్యంగా వ్యవహరించి పక్కకు లాగేశాడు ట్రాఫిక్ పోలీసు. బాధితుడికి ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్ సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. బాధితుడి ఛాతిపై నొక్కుతూ అతడు కోమాలోకి వెళ్లకుండా చూశారు. స్థానికులు, పోలీసుల నుంచి సమచారం అందుకున్న అంబులెన్స్ కొద్దిసేపటికే అక్కడికి వచ్చింది. ఆ వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.