Ex Mla Anil On Congress Seniors : తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల వివాదం ముదురుతోంది. సేవ్ కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ సీనియర్లు పోరుబాట పట్టారు. వలస నేతలకు కమిటీల్లో స్థానం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్లు ఆరోపిస్తున్నారు. అయితే సీనియర్లకు మాజీ ఎమ్మెల్యే ఎరవత్రి అనిల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని, రేవంత్‌రెడ్డిని బలహీనపర్చేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈనెల 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయిస్తే, పాదయాత్రను దెబ్బతీయాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు ముసుగులో ఉన్న వారు ఇప్పుడు బయటకు వచ్చారన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు సేవ్‌ కాంగ్రెస్‌ ఎందుకు గుర్తురాలేదని అనిల్ సీనియర్లను ప్రశ్నించారు. అప్పుడు పీసీసీగా ఉన్నవాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.  


సీనియర్ల లోపాయికారి ఒప్పందం 


ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఏంచేశారని ఎరవత్రి అనిల్ ప్రశ్నించారు. ఈ సీనియర్లంతా పార్టీ కోసం పనిచేస్తే మునుగోడులో 50 వేల ఓట్ల తేడాగా గెలిచే వాళ్లమన్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఆఫీస్ పై పోలీసులు దాడి చేస్తే సీనియర్లు ఎక్కడికి పోయారని నిలదీశారు. కాంగ్రెస్ సీనియర్ల లోపాయికారి ఒప్పందం బీజేపీతోనా లేక బీఆర్‌ఎస్‌తోనా? అని ప్రశ్నించారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్వార్థం కోసం టీడీపీ పొత్తు పెట్టుకోలేదా అంటూ మండిపడ్డారు. ఇవాళ టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఎందుకని ప్రశ్నిస్తున్నారని?ఇది న్యాయమా అంటూ ఉత్తమ్‌ కుమార్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కమిటీల సమాచారం లేదనడం అవాస్తవం అన్నారు. సీవీ ఆనంద్ చెప్పిన మాటాలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. సునీల్‌ కనుగోలు కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు. ఉత్తమ్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు ఆధారాలు ఉన్నాయా? అని అనిల్ ప్రశ్నించారు.  


ఉత్తమ్ ముసుగు వీరుడు 


ఉత్తమ్ కుమార్ రెడ్డి ముసుగు వీరుడని మాజీ ఎమ్మెల్యే అనిల్ విమర్శించారు. మునుగోడులో ఎవరెవరు ఎంత లబ్ధి పొందారో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఉత్తమ్ గత ఎన్నికల్లో ఎవరెవరికి ఎంత డబ్బులిచ్చారో తెలుసన్నారు. కాంగ్రెస్ డబ్బులపై లెక్కలు అడుగుతారనే నారాయణ రెడ్డిని బీజేపీలోకి పంపారని విమర్శించారు. కౌశిక్‌రెడ్డికి ఉత్తమ్‌ ఎన్ని కోట్లు ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. కౌశిక్‌రెడ్డిని టీఆర్ఎస్‌లోకి పంపించి ఎమ్మెల్సీ చేయించారని ఉత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ లో కోవర్టుగా పనిచేసినందుకే టీఆర్ఎస్‌లో కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి దక్కిందన్నారు. సీనియర్ల కుట్రలతోనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ముసుగువీరుల కుట్రలకు సామాన్య కార్యకర్తలు బలికావొద్దన్నారు. 


కాంగ్రెస్ పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరు 


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ప్రజల్లోకి వెళ్లనీయడం లేదని, సీనియర్లు ఆయనను ఇబ్బంది పెడుతున్నారని అనిల్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌కు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పాదయాత్రను ఎవరూ ఆపలేరన్నారు. రేవంత్ పాదయాత్ర వల్ల సీనియర్లకు వచ్చిన ఇబ్బందేంటని ఆయన నిలదీశారు. ఇతర పార్టీలకు ఎలా లాభం చేయాలనే సీనియర్లు చూస్తున్నారన్నారు. పాదయాత్రలకు సీనియర్లు వచ్చినా చేసేదేం లేదన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోసం ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పనిచేశారన్నారు. కాంగ్రెస్‌కు నష్టం చేసిన వెంకట్‌రెడ్డితో ఉత్తమ్ ఎలా అంటకాగుతారని ప్రశ్నించారు. ఉంటానంటూ వెంకట్‌రెడ్డి ఉత్తమ్‌కు ఎందుకు ఫోన్ చేశారని నిలదీశారు. మునుగోడులో వెంకట్‌రెడ్డికి ఉత్తమ్ పనిచేశారా? లేదా? సమాధానం చెప్పాలన్నారు. దిల్లీలో ఉత్తమ్ ఏదో చేస్తారని అందరూ భయపడతారని కానీ ఆయన ఏం చేస్తే తమకేంటన్నారు.