Jharkhand Murder:
పదునైన ఆయుధంతో హత్య..?
ఝార్ఖండ్‌లో శ్రద్ధ తరహా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సాహిబ్‌గంజ్ జిల్లాలో గిరిజన తెగకు చెందిన ఓ వ్యక్తి తన రెండో భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. శవాన్ని 18 ముక్కలు చేశాడు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు మరి కొన్ని వివరాలు వెల్లడించారు. "22 ఏళ్ల మహిళ మృత దేహానికి సంబంధించిన 12 శరీర భాగాలను గుర్తించాం. తలతో సహా మిగతా శరీర భాగాలు ఇంకా దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుడు దిల్దార్ అన్సారీని అదుపులోకి తీసుకున్నాం" అని చెప్పారు. సంతాలి మోమిన్ తోల ప్రాంతంలో కొన్ని శరీర భాగాలు గుర్తించామని స్పష్టం చేశారు. బాధితురాలు రూబికా పహదిన్...నిందితుడికి రెండో భార్య అని తెలిపారు. రెండేళ్లుగా వీళ్లిద్దరి మధ్య పరిచయం ఉందని,మృతురాలి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. విచారణలో భాగంగా...రూబికా హత్యకు గురైందని తేలింది. శవాన్ని కట్ చేసేందుకు ఎలక్ట్రిక్ కట్టర్ లాంటి పదునైన ఆయుధాన్ని వినియోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అటు రాజకీయంగానూ ఈ ఘటనపై పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. "హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో బాలికలు, యువతులపై ఇలాంటి దారుణాలెన్నో జరుగుతున్నాయి. మైనార్టీ వర్గానికి చెందినకొందరు వ్యక్తులు కావాలనే మహిళలపై ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కదలిక లేకుండా ఉంటే...మేమే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటాం" అని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ అన్నారు.