MLA Pilot Rohith Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలకు అబద్ధాలు చెప్పటం వెన్నతో పెట్టిన విద్యని ఆరోపించారు. కాషాయదళ నేతలంతా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. కావాలనే రాష్ట్ర అధికార పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో టార్గెట్ చేస్తూ హింసిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను నిజమైన హిందువుగా అమ్మవారి వద్ద సవాల్ చేశానని... బండి సంజయ్ మాత్రం తన సవాల్ ను స్వీకరించ లేదని వివరించారు. ఆయన సవాల్ ను స్వీకరించనప్పుడే బండి సంజయ్ చేసిన ఆరోపణలు తప్పు అని ప్రజలకి అర్థం అయిందని తెలిపారు.










వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యావో చెప్పాలి..!


బండి సంజయ్ మతం పేరుతో రెచ్చగొట్టడం యువతని తప్పుదోవ పట్టిస్తున్నాడని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ ఇక్కడికి రాకపోవటంతో నిజమైన హిందువు కాదని అర్థం అయిందని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ కు రఘునందన్ అనే వకాల్తా పుచ్చుకున్నారని పేర్కొన్నారు. రఘునందన్ పఠాన్ చెరులో పరిశ్రమల నుంచి వసూళ్లు చేయలేదా అని ప్రశ్నించారు. ఏమీ లేని స్థాయి నుంచి వందల కోట్లకు ఎలా ఎదిగావని అడిగారు. స్టార్ హోటళ్లలో సంవత్సరం పొడవునా రూమ్స్ పెట్టుకొనే స్థాయికి ఎలా వచ్చావో చెప్పాలని అన్నారు. న్యాయం చేయాలని ఒక మహిళా మీ వద్దకు వస్తె నాగు పాములాగా కాటేయలేదా అని ప్రశ్నించారు. అంతే కాకుండా డ్రగ్స్ కేసులో కొంతమంది నటీనటులకు మీరు వకాల్తా పుచ్చుకున్నారా లేదా అంటూ ఫైర్ అయ్యారు. 






ఆరోపణలు నిజం చేస్తే పదవికి రాజీనామా చేస్తా..!


 బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధం అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వెల్లడించారు. బండి సంజయ్, రఘునందన్ రావులు తనపై చేసిన ఆరోపణలకు ఎక్కడికి వచ్చి మాట్లడమన్నా మాట్లాడతానని సవాల్ విసిరారు. ఇందుకు మీరు సిద్ధమైతే చెప్పడంటూ తెలిపారు. వేములవాడ లేదా తాండూరు బద్రేశ్వర స్వామి ఆలయాల్లో ఎక్కడికి వచ్చినా తాను రెడీ అని చెప్పారు. ఈడీ నోటీసుల విజయంలో తమ న్యాయవాదులతో చర్హ్చించి సాయంత్రంలోగా నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.