హైదరాబాద్‌లో ఆదివారం సంచలనం రేపిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాయినాథ్‌ను స్నేహితులే చంపారని పోలీసులు తేల్చారు. ఆకాష్, టిల్లు, సోనూ హత్య చేసినట్లుగా నిర్ధారించారు. సాయినాథ్ అనే యువకుడిని నిన్న (జనవరి 22) నడి రోడ్డుపై రాడ్లతో కొట్టి, కత్తులతో పొడిచిన సంగతి తెలిసిందే. నిందితులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరిగిందంటే
జనవరి 22న హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ రోడ్డుపైన అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా కత్తితో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
పట్ట పగలు నడిరోడ్డుపై వాహనదారులు చూస్తుండగానే యువకుడిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర గాయాలకు గురైన సదరు యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు. ఘటన తర్వాత ముగ్గురు నిందితులు అక్కడి నుంచి తలోదిక్కుకీ పరారయ్యారు. అయితే, హత్యకు గురైన యువకుడి వివరాలు, హత్యకు గల కారణాలు ఏమీ తెలియరాలేదు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో న్యూ జియాగూడలోని పురాణాపూల్ వెళ్లే రోడ్డుపై ఈ ఘటన జరిగింది.
యువకుడిని ముగ్గురు వ్యక్తులు కత్తులతో వెంబడించారు. యువకుడు పారిపోతూ పడిపోవడంతో ఆ తర్వాత ముగ్గురు విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే, రోడ్డు వెంట వెళ్తున్న వారంతా చూస్తూ ఉన్నారు కానీ, ప్రాణభయంతో ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మరికొందరు సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.