పరాయి వ్యక్తులతో పెట్టుకొనే వివాహేతర సంబంధాలు కాపురాలు కూల్చడమే కాకుండా జీవితాల్లో ఎంతటి విషాదం నింపుతాయో గతంలో ఎన్నో ఘటనలు చాటాయి. మరోసారి ఆ తరహా ఘటనే జరిగింది. కన్న తల్లి దూరం అవుతుందని బెంగ పెట్టుకున్న కుమారుడు ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అంతం చేశాడు. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 


ఏపీలోని కృష్ణా జిల్లా తేలప్రోలు గ్రామానికి చెందిన పెళ్లైన మహిళకు, కోల వెంకటరమణ మూర్తి అనే 47 ఏళ్ల అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. చాలా ఏళ్లుగా వీరు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. అలా తేలప్రోలు నుంచి 14 ఏళ్ల క్రితం సదరు మహిళ తన కుటుంబ సభ్యులను వదిలేసి హైదరాబాద్‌కు వచ్చి వెంకటరమణ మూర్తితో ఉంటోంది. ఫీర్జాదిగూడలోని బీబీసాహెబ్‌ మక్తా అమృత కాలనీలోని ఉన్న వృద్ధాశ్రమంలో వెంకటరమణ మూర్తి కేర్‌ టేకర్‌గా పని చేస్తూ ఉన్నాడు. వారిద్దరూ అదే ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని సహ జీవనం చేస్తున్నారు. మరోవైపు, మహిళ కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం 14 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.


ఆ క్రమంలోనే ఫేస్‌బుక్‌ ద్వారా తన తల్లి ఆచూకీని కుమారుడు తెలుసుకున్నాడు. ఆమె ఉంటున్న అడ్రస్ ను కూడా కనుక్కొని హైదరాబాద్ కు వచ్చాడు. వెంకటరమణ మూర్తికి నచ్చ జెప్పి, తన తల్లిని వెంట తీసుకెళ్లి, మళ్లీ తీసుకొస్తానని ఆమెను సొంత ఊరైన తేలప్రోలుకి తీసుకువెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో వెంకటరమణ మూర్తి కొన్ని రోజులుగా ఆమెకు ఫోన్‌ చేస్తూ హైదరాబాద్ కు రావాలంటూ బలవంతం చేస్తున్నాడు. అయితే, ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన తన తల్లి మళ్లీ వెంకటరమణ మూర్తికి దగ్గరై తమకు దూరమవుతుందనే ఆలోచన కుమారుడిలో మొదలైంది. 


దీంతో మళ్లీ నెల రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చి ఉన్నాడు. వెంకటరమణ మూర్తితో ఫ్రెండ్లీగా ఉంటున్నట్లు నటించాడు. ప్రణాళిక ప్రకారం ఆదివారం మధ్యాహ్నం వెంటకరమణ మూర్తి వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి మందు తాగుతూ మాట్లాడుకున్నారు. అక్కడే ఉన్న 5 కేజీల గ్యాస్‌ సిలిండర్‌తో వెంకటరమణ మూర్తి తల, పక్కటెముకలపై దాడి చేయడంతో పాటు తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. అదే సమయంలో సిలిండర్‌ కింద విసిరేసినట్లు శబ్దం రావడంతో ఇంటి యజమాని కొడుకు పైకి వెళ్లి చూశాడు. అప్పటికే వెంకటరమణమూర్తి రక్తపు మడుగులో ఉన్నాడు. వెంటనే స్థానికులు నిందితుడ్ని గది లోపలే ఉంచి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.