8th Nizam of Hyderabad passes away in Turkey: ఏడవ అసఫ్ జా ఉస్మాన్ అలీఖాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబు భర్కత్‌ అలీ ఖాన్‌ వల్షన్‌ ముకరం ఝా బహదూర్ కన్నుమూశారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి ముకరం ఝా తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ ఎనిమిదో నిజాం అయిన ముకరం ఝా చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లో అసఫ్ జాహీ టూంబ్స్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముకరం ఝా పార్ధివదేహాన్ని జనవరి 17న టర్కీ నుంచి హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ముకరం ఝా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచనున్నట్లు సమాచారం. 


ఎనిమిదో నిజాం ముకరం ఝా మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్ 8వ నిజాం ముకర్రమ్ ఝా (Mukarram Jah) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. 
హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతులకు 1933 అక్టోబర్‌ 6న ముకర్రమ్ ఝా (Mukarram Jah) జన్మించారు. ప్రిన్సెస్ దుర్రె షెహవార్ టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం చివరి సుల్తాన్ కుమార్తె. తాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వారసుడిగా ముకర్రం ఝాను 1954 జూన్ 14న ప్రకటించారు. అప్పటినుంచి 1971 వరకు ముకర్రం ఝా హైదరాబాద్ 8వ నిజాంగా ఉన్నారు. 


టర్కీలోని ఇస్తాంబుల్ లో నుంచి ముకర్రమ్ ఝా పార్థివ దేహం హైద్రాబాద్ కు చేరుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్దారించి తదుపరి చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్ కి సిఎం కేసీఆర్ తెలిపారు. సిఎం కేసీఆర్ సూచనల మేరకు అందుకు సంబంధించి ఏకె ఖాన్ సమన్వయం చేస్తున్నారు.