Alluri Sitarama Raju 125 Birth Anniversary In Hyderabad: మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజుని గుర్తు చేసుకోవడం ప్రతి భారత పౌరుడి బాధ్యత అని కేటీఆర్ అన్నారు. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని కొనియాడారు. ప్రభుత్వం అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఆ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు కేటీఆర్​, వి శ్రీనివాస్​ గౌడ్​, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 


ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. క్షత్రియ సామాజిక వర్గంలోని పేదల కోసం స్థలం అడిగినందున ప్రభుత్వం మూడు ఎకరాల భూమి కేటాయించిందని కేటీఆర్​ తెలిపారు. క్షణం ఆలోచించకుండా మూడు ఎకరాల భూమిని కేసీఆర్ కేటాయించారని అన్నారు. త్వరలోనే అక్కడ భూమి పూజ నిర్వహించాలని కోరారు. అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఎన్ని ప్రతికూలతలు, కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ పని చేస్తూనే ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనని అన్నారు. 


జల్ - జంగల్ - జమీన్ కోసం కొమరం భీమ్ పోరాడారని గుర్తు చేశారు. అల్లూరి సీతారామ రాజు కూడా బ్రిటిష్ వారిపై పోరాడారని గుర్తు చేశారు. అతి త్వరలోనే అల్లూరి భవన నిర్మాణం పూర్తిచేసుకుని దానికి అల్లూరి పేరు పెట్టడమే సముచితమని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.