తెలంగాణలో బీజేపీ నేతల హడావుడి, కాషాయ జోరు మధ్య టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలించింది. ఆ పార్టీకి చెందిన మేయర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్‌పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపారు. టీఆర్ఎస్ పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అందుకు కారణం కొన్ని అనివార్య, తన వ్యక్తిగత కారణాలు అంటూ వివరించారు. ఇప్పటి వరకూ పార్టీలో తనకు సహాకరించిన ప్రతీ ఒక్కరికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బడంగ్ పేట అభివృద్ధి కోసం తాను టీఆర్ఎస్ పార్టీలో చేరానని, అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసమే పని చేశానని బండంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి వెల్లడించారు.


కాంగ్రెస్ పార్టీలోకి..
తాము ఇప్పటిదాకా టీఆర్ఎస్ లో క్రమశిక్షణతో మెలిగామని, అంకితభావంతోనే తాము సేవలందించామని గుర్తు చేశారు. కొంతకాలంగా తమ పట్ల వ్యతిరేక భావనతో పార్టీ పెద్దలు ఉంటున్నట్లు గ్రహించామని చెప్పారు. తాము ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు. తమ ఉన్నతిని ఓర్వలేక, ప్రజలలో పెరుగుతున్నటువంటి ఆదరాభిమానాలను పార్టీలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని వెల్లడించారు. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పారు. కాగా, మేయర్ దంపతులు గత రెండు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు.


మంత్రి సబిత వల్లే టీఆర్ఎస్‌లోకి.. ఆమె వల్లే రాజీనామా?
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పారిజాత నర్సింహారెడ్డి రెండేళ్ల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరగా, ఆమెను బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ పదవి వరించింది. అయితే కొద్ది రోజులుగా మంత్రి సబితతో మేయర్ కు విభేదాలు వచ్చాయని సమాచారం. కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమం తనకు తెలిసే జరగాలని మేయర్ కు మంత్రి సబిత నిబంధనలు విధిస్తు్న్నారని తెలుస్తోంది. 


చిన్నచిన్న పనులు కూడా మంత్రి చేతుల మీదుగా ప్రారంభం అవుతున్నాయి. సబితా తీరుతో మనస్తాపానికి గురైన పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేశారని అంటున్నారు. ఆమె కొన్ని రోజుల క్రితమే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పటి నుంచే పారిజాత దంపతులు పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరిగింది. తాజాగా అదే నిజమైంది.