హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై సోలార్ పైకప్పు కలిగిన సైకిల్ ట్రాక్ నిర్మాణం కోసం మంత్రి కేటీఆర్ నేడు (సెప్టెంబరు 6) శంకుస్థాపన చేశారు. నగరంలోని నానక్ రామ్‌గూడ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. మొదటి దశ కింద 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ కలిగిన సైకిల్ ట్రాక్‌ను నిర్మిస్తారు. 16 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా దీనిని ఏర్పాటు చేస్తారు. 2023 వేసవి నాటికి ఈ ట్రాక్ ను అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) లక్ష్యంగా నిర్దేశించుకుంది. నానక్ రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ప్రజలకు ఉపయోగమైన నాన్ మోటరైజ్ ట్రాన్స్‌పోర్ట్ సెల్యూషన్స్‌ను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ట్రాక్‌కు శంకుస్థాపన చేశామని అన్నారు. ‘‘గత ఆరు నెలల కిందట ఓ మిత్రుడు సౌత్ కొరియాలో సైక్లింగ్ ట్రాక్ ఉందని, హైవే మధ్యలో సోలార్ ప్యానళ్లతో కట్టారని నాకు చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపించింది. మన దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనిపించి అధికారులకు చెప్పాను’ అని కేటీఆర్ అన్నారు.
దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి అమలుచేస్తామని హామీ ఇచ్చినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. అందులో భాగంగా అధికారులను సౌత్ కొరియాకు పంపామని, ఆ తర్వాత దుబాయిలోనూ ఈ ట్రాక్ లను పరిశీలించారని తెలిపారు. స్థానికంగా ఉండే యువకులు, ఐటీ రంగాల్లో పనిచేసే వారందరికీ ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్ నుంచి ఇంటికి అవసరమైతే సైక్లింగ్ చేస్తూ వెళ్లి వచ్చే పద్ధతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ప్రస్తుతం అందరికీ ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరిగిందని అన్నారు. తాము నిర్మించబోయే ఈ సైకిల్ ట్రాక్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని - అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలు ఎవరైనా ఇక్కడ సైకిళ్లు తొక్కవచ్చని అన్నారు. శంకుస్థాపన చేయడంతో పాటు మోడల్ డెమో కింద 50 మీటర్లు తయారు చేశామని చెప్పారు. జర్మనీ, సౌత్ కొరియా, ఇతర దేశాలకు దీటుగా నాలుగున్నర మీటర్ల వైశాల్యంతో ప్రపంచ స్థాయిలో ఈ 50 మీటర్లు నిర్మించామని తెలిపారు. భవిష్యత్తులో అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీ నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.