Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రూల్స్ ఎంత ముఖ్యమో సంప్రదాయాలు కూడా అంతే ముఖ్యం అని అన్నారు. ద్వేష పూరిత రాజకీయాలకు పరాకాష్టగా అసెంబ్లీనే మార్చేశారని వ్యాఖ్యానించారు. బీజేపీని బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశానికి పిలవకపోవడంపై ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. గత 20 ఏళ్లుగా తాను అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. పార్టీ తరపున ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీని పిలిచే సంప్రదాయం ఉందని అన్నారు. అలాంటిది, 4 పార్లమెంట్, 3 శాసన సభ్యులు ఉన్న పార్టీ అలాంటి పార్టీ సభ్యులను బిజినెస్ అడ్వైసరీ కమిటీ మీటింగ్ కి పిలవకపోడం ద్వేష పూరిత రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.
‘‘మీకు ఇదే గతి పడుతుందని మర్చిపోకండి. పార్టీలు ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు. సభ ఎప్పటికీ ఉంటుంది. స్పీకర్.. మరమినిషి లెక్క కాకుండా సభ్యుల హక్కులు కాపాడాలి’’ అని ఈటల రాజేందర్ విమర్శించారు.
రఘునందన్ రావు మాట్లాడుతూ.. ‘‘బీఏసీకి పిలవకపోవడం శోచనీయం. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకే తానుముక్కలు. ఇదే శాసన సభలో బీఏసీకి అవసరమయ్యేంత మంది సభ్యులతో వస్తాం’’ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాలు విసిరారు.
అసెంబ్లీ వాయిదా
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమై కాసేపట్లోనే వాయిదా పడ్డాయి. ముందు సభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపారు. తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డిల మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అనంతరం తమ శాఖల సంబంధించిన నివేదికను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నెల 12వ తేదీకి అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో పురపాలక చట్ట సవరణ సహా 6 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
కాంగ్రెస్‌కు తగ్గిన ఓ ఎమ్మెల్యే..
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభానికి ముందే సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ భేటీలో చర్చించారు. బీఎసీ సమావేశం తర్వాత మరోసారి సమావేశం కావాలని సీఎల్పీ నిర్ణయించింది. గత అసెంబ్లీ సమావేశాలతో పోల్చితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే తగ్గారు. మునుగోడు నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి సమర్పించగా, కొంత సమాయానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను ఆయను ఆమోదించారు.
ఉదయం 11:30 గంటలకు ప్రారంభం, అంతలోనే సభ వాయిదా
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డిల మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అసెంబ్లీని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాలలో భాగంగా తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీస్ రూల్స్ 2022 బిల్లును రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సభలో ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో ప్యానెల్ స్పీకర్లుగా రెడ్యా నాయక్, మోజం ఖాన్, హనుమంత్ షిండేల పేర్లను స్పీకర్ పోచారం ప్రకటించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొంటారు.