తన జీవితమంతా పోరాటాలతోనే గడుస్తోందని, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రైతుల కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నానని తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు దాదాపుగా తగ్గిపోయాయని, దేశమంతా ఇదే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్​లో సీఎం కేసీఆర్​సమక్షంలో మహారాష్ట్రకు చెందిన రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రైతు సంఘాల నేతలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


రైతుల పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు కేసీఆర్. అన్నదాతల పోరాటంతో మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు శరత్ జోషి, ప్రణీత్ సహా తదితరులకు కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. తన రాజకీయ జీవితమంతా పోరాటాలతోనే గడిచిపోయిందన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం కోసం కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామన్న కేసీఆర్.. ఇప్పుడు సీఎంగా ఉన్నా రైతుల కోసం ఢిల్లీలో పోరాటాలు చేస్తున్నామని గుర్తుచేశారు. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలు దిగొస్తాయని, అందుకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు సాగు చట్టాలే నిదర్శనం అన్నారు కేసీఆర్.






దేశంలో రైతు సంఘ‌టిత శ‌క్తిని ఏకం చేద్దామ‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో 14 మంది ప్రధానులు మారినా ప్రజ‌ల త‌ల‌రాత, రైతుల తలరాత మాత్రం మార‌లేదు అన్నారు. రైతుల పోరాటం న్యాయ‌బ‌ద్ధమైన‌ది. త‌లచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండ‌దన్నారు. చిత్తశుద్ధితో ప‌ని చేస్తే గెలిచి తీరుతాం. తన 50 ఏండ్ల రాజ‌కీయ జీవితంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నానని తెలిపారు. తెలంగాణ‌లో తమ ప్రభుత్వం ఏం చేసిందో మీరంతా గమనించండి. కాళేశ్వరం ప్రాజెక్టును సంద‌ర్శించండి అని మహారాష్ట్ర రైతు సంఘాల నేత‌ల‌కు ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు.


దేశ రాజ‌ధాని ఢిల్లీలో రైతులు 13 నెల‌ల పాటు పోరాడారు అని కేసీఆర్ గుర్తు చేశారు. తమకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలపై పోరాటం చేసిన రైతలును ఉగ్రవాదులన్నారు. ఉగ్రవాదుల తరహాలోనే అన్నదాతలను ట్రీట్ చేయడం దారుణమన్నారు. ఖలీస్తానీలు, వేర్పాటువాదుల‌ు అంటూ రైతులను ఒక్కో పేరుతో పిలిచి వేధించారని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రైతు పోరాటంలో 750 మంది అన్నదాతలు చ‌నిపోతే ప్రధాని నరేంద్ర మోదీ క‌నీసం స్పందించ‌కపోవడం దారుణం అన్నారు. దేశంలో సంపద ఉన్నా, రైతులు, సామాన్యులు నేటికీ ఎన్నో అంశాల్లో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అని కేసీఆర్ పేర్కొన్నారు.


యాసంగిలో 94 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు అవుతోంది. దేశంలోనే యాసంగి సాగులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అందులో 56 లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నాం. సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ దేశం అభివృద్ధి సాధించలేదు. తెలంగాణ ఏర్పడ‌క ముందు రైతులు, చేనేత‌ కార్మికులు ఆత్మహ‌త్యలు చేసుకునేవారు అని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. రైతుల కష్టాలు చూస్తే కన్నీళ్లు వచ్చేయని, అందుకే రైతుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తే కేంద్రంలో ప్రభుత్వం మారిపోతుందని సూచించారు కేసీఆర్.