అది 1967 ఫిబ్రవరి. పెద్ద భవనంలోని ఒక చిన్న గదిలో ఆయన మంచం పై పడుకున్నారు. ఆయన అంతలా జబ్బు పడడం ఆ మూడేళ్ళలో అది రెండవసారి . ఆయనకు ఫ్లూ, బ్రాంకో - న్యుమోనియా వంటి జబ్బులు సోకి ఉంటాయని భావించడమే తప్ప సరైన రోగ నిర్ధారణ జరగలేదు. తగ్గినట్టే తగ్గిన జబ్బు ఫిబ్రవరి 18న  తిరగబెట్టింది. ఆయన కూతురు షాజాదీ పాషా ఏమో ఆధునిక వైద్యులెవర్నీ దగ్గరకు  రానీయలేదు . దానితో అటు జబ్బేమిటో తెలీక  సరైన మందులు అందక ఆయన పరిస్థితి దిగజారింది. ఆయనెవరో కాదు  దాదాపు 4 దశబ్దాల పాటు హైదరాబాద్ రాజ్యాన్ని ఎదురులేకుండా పరిపాలించిన పాలకుడు. ఆనాటి బ్రిటీష్-ఇండియాలో మిగిలిన రాజుల  అత్యంత స్వేచ్ఛగా పాలన సాగించిన నవాబ్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు గాంచిన సుల్తాన్ మీర్  ఉస్మాన్ అలీఖాన్ .. ఇంకోలా చెప్పాలంటే హైదరాబాద్ నవాబ్ -ఏడో నిజాం . 


స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో :


స్వాతంత్య్రం వచ్చేసరికి అంటే 15 ఆగస్టు 1947 నాటికి ఇండియాలో 565 రాజ సంస్థానాలు ఉండేవి. అయితే వాటిలో అతిపెద్దవి మాత్రం 5. వాటిని పాలించే రాజులకు 21 తుపాకులతో సెల్యూట్ అందుకునే గౌరవాన్ని ఇచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. అవే హైదరాబాద్,మైసూర్, జమ్మూ&కాశ్మీర్ ,బరోడా ,గ్వాలియర్ . మొత్తం దేశ విస్తీర్ణంలో 40 శాతం భూమి ఈ రాజసంస్థానాల అధికారంలోనే  ఉండేది . 
భారత ప్రభుత్వం వీరితో జరిపిన చర్చల ఫలితంగా చాలామంది రాజులు భారత్‌లో కలిసిపోయారు .కేవలం కాశ్మీర్,హైదరాబాద్ ,జునాఘడ్ అభ్యంతరం తెలిపాయి .  కాశ్మీర్ పాలకుడు హరిసింగ్ నాన్చినా చివరికి మనవైపే మొగ్గు చూపగా జునాఘడ్ (గుజరాత్),హైదరాబద్ మాత్రం కుదరదన్నాయి.దానితో భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా రెండు రాజ్యాలనూ ఇండియా లో కలిపేశాయి.
 
జునాఘడ్ రాజు మహమ్మద్ మొహబ్బత్ ఖాన్ ఇండియా వదిలేసి పాకిస్థాన్‌లోని సింద్ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయాడు.హైదరాబాద్ నిజాం అధికారాన్ని కోల్పోయినా వైభవాన్ని కోల్పోలేదు . భారత ప్రభుత్వం నిజాంతో చాలా మర్యాదగానే ప్రవర్తించింది . 


రాజు కాస్తా ఎలా రాజప్రముఖ్ అయ్యారు? 


స్వాతంత్య్రం వచ్చేసరికి నిజాం అన్నా ఆయన పాలన అన్నా విపరీతమైన కోపం ఉండేది జనాలకు. కారణం నిజాం సన్నిహితుడు ఖాసీం రిజ్వీ కింద పని చేసే రజాకార్లు. స్వాత్రంత్య భారతావనిలో కలవాలనుకున్న హైదరాబాదీ ప్రజల పై కర్కశంగా రజాకార్లు చేసిన దురాగతాలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో మాయని గాయలే. 


నిజానికి ఒకానొక దశలో రజాకార్ల సైన్యంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దూరిపోయి ఖాసీం రిజ్వీ చేయికూడా దాటిపోయాయని అప్పటి హైదరాబాద్ రాజ్య ప్రధాని  మీర్ లాయక్ ఆలీ కూడా చెప్పుకొచ్చారు. 1948 నాటి పోలీస్ చర్య "ఆపరేషన్ పోలో " ద్వారా హైదరాబాద్ భారత్‌లో కలిసిన తర్వాత వాళ్ళను జైల్లో పెట్టారు . తర్వాత నెమ్మదిగా ప్రజల కోపం చల్లారడంతో తిరిగి తమ పాత ప్రభువు నిజాంపై అభిమానం మొదలైంది. 



కింగ్ కోఠీ లోని తన భవనం నుంచి ఎప్పుడో గాని బయటకు వచ్చేవారు కాదు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్. కోట్ల ఆస్తి ఉన్నా నిరాడంబరంగా బతికే ఆయనపై జాలి చూపడం మొదలుపెట్టారు హైదరాబాదీలు .


అధికారం పోయాక నిజాం రోజువారీ దినచర్య ఇదే .. !


పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్‌లోనికి ప్రవేశించిన అధికారులు ఇరువర్గాలకూ లాభదాయకమైన ఒప్పందాలు చేశారు. దాని ప్రకారం నిజాం తన సొంత ఎస్టేట్ సర్ఫేఖాస్ వదులుకోవాల్సి వచ్చింది. దాని విలువ అప్పట్లోనే 2.5కోట్ల రూపాయలుగా అంచనా వేసిన ప్రభుత్వం దానికి బదులుగా నిజాంకు చనిపోయేవరకూ 25 లక్షల రూపాయలను ప్రతీ ఏటా చెల్లించేందుకు ఒప్పుకుంది . 


1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చిన రాజ్యాంగం హైదరాబాద్‌లో కూడా అమలైంది. నిజాంను రాజ ప్రముఖ్‌గా  నియమించారు. గవర్నర్ లా ఆనాటి హైదరాబాద్‌కు రాజ్యాంగపరమైన అధినేతగా కొత్త పదవిలోనికి ప్రవేశించాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయనకు భరణంగా జీవితాంతం 1.25 కోట్ల రూపాయలను ప్రతీ ఏటా  చెల్లించేందుకు ఒప్పుకుంది భారత ప్రభుత్వం. 


1952లో హైదరాబాద్‌లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్య   పద్దతిలో ఎన్నికైన తొలి మంత్రివర్గంతో 1952 మార్చ్ 6న కింగ్ కోఠీ లోని తన నివాసంలో ప్రమాణం చేయించారు రాజప్రముఖ్ నిజాం .  


ఆ నాలుగు గోడల మధ్య తానే  రాజు :


రాజుగా తన అధికారం కోల్పోయాక నిజాం నెమ్మదిగా బయటకు రావడం మానేశారు. కేవలం తన నివాసం అయిన కింగ్ కోఠీ లోనే ఉండేవారు. ఆ నాలుగు గోడల మధ్యే రాజు . నాలుగు దశాబ్దాలపాటు దేశంలోని అతిపెద్ద రాజ్యాల్లో ఒకటైన హైదరాబాద్ పాలించిన ఆయన పాత భవంతిలో భార్యలు పిల్లలతో గడిపేవారు.నిజానికి ఆయన అప్పటికి ప్రపంచంలోనే అతిగొప్ప ధనవంతుడని పత్రికలు గొప్పగా రాశాయి. అది నిజం కూడా .. ! కానీ ఆయన జీవన విధానం  మాత్రం అదే . వీలైనంత నిరాడంబరంగా ఉండేవారు . 


నిజాం వద్ద పని చేసినవారికి ఎవరికి ఏ జబ్బు చేసినా మందు నిజామ్ ఇచ్చేవారట. యునానీని ఎక్కువగా విశ్వసించే ఆయన మోడ్రన్ మెడిసిన్ ని మాత్రం దగ్గరకు రానిచ్చేవారు కాదని ప్రచారంలో ఉంది. దీన్ని ఆయన వారసులు ఖండిస్తున్నారు. ఇక తన కోఠీలో నౌకర్ల మధ్య వచ్చే వివాదాలకు తీర్పులు తీర్చేవారరు ఆయన. వారికీ ఆయన మాటే శిరోధార్యం . బయట ప్రపంచంతో వారికి సంబంధం లేదు . వారి దృష్టిలో ఆయనే తమకు రారాజు . నవాబ్‌గా ఉన్నప్పుడు  ఆయన మీద జరిగిన ప్రచారానికి  తర్వాత ఆయన ప్రవర్తనకూ అసలు సంబంధమే ఉండేది కాదనేవారు. 


వయస్సు మీద పడుతున్న కొద్దీ నిజాంకు తన సంతానం మీద బెంగ మొదలైంది అంటారు . తాను మరణించాక ఎవరూ కష్టపడకూడదని నిజాం తన కోట్ల ఆస్తిని ట్రస్టుల రూపంలో భద్రపరిచి తన వారసులకు జీవితాంతం సాఫిగా సాగేంత డబ్బు అందేలా ఏర్పాటు చేశారు. ఇంకా పుట్టని తన మనవరాళ్ల పెళ్లిళ్ల సమయంలో ఎంత ఆస్తి చెందాలి అన్నదీ కూడా ఆయన వీలునామా రాసారంటే కుటుంబం గురించి ఎంత తాపత్రయ పడ్డారో అర్ధమవుతుంది. 


1964లో మొదటిసారి ఆయన జబ్బుపడ్డప్పుడు ఆయన ఇక బతకడు అన్న వార్త పుట్టింది . దీంతో ఆయన వారుసుల్లో చాలా మంది తన స్థానం కోసం పోటి పడ్డారని గ్రహించారు నిజాం. ఆయన కోలుకున్న తర్వాత తన మనువడు ముఖరం జాను వారసుడిగా ప్రకటించారు. ప్రస్తుతం 88 ఏళ్ల వయస్సులో ఉన్న ఆయన ఎన్నో నిజాం భవనాలకు నిజమైన వారసుడు . పోయినవి పోగా ఆయన ప్రస్తుత ఆస్తుల విలువ ఒక బిలియన్ అమెరికా డాలర్లు అంటారు తెలిసినవారు . 


తన కుటింభీకులు బంధువులే కాదు .. తన నౌకర్ల జీవితం కూడా సాఫీగా సాగిపోయేలా డబ్బును అందించడానికి కూడా మరో ట్రస్ట్ ఏర్పాటు చేసారాయన . 


చివరి క్షణాలు :


అన్ని పనులూ పూర్తి చేకున్న తర్వాత కూడా నిజాంకు ఒక విధమైన వైరాగ్యం వచ్చేసింది. ఎప్పుడూ కవిత్వం రాస్తూ .. గజల్స్ పాడుతూ మనవాళ్లతో ఆడుకునే ఆయన 1967లో తీవ్రంగా జబ్బుపడ్డారు. వైద్యంతో కోలుకున్నట్టే కనపడినా 1967 ఫిబ్రవరి 18 నుంచి మళ్ళీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు . 8మంది భార్యల్లో ఆయన ఆరోగ్యం కోసం ముగ్గురు హజ్‌కు వెళ్లారు. 


ఈలోపు సుల్తాన్ చనిపోయాడన్న పుకార్లతో పెద్దఎత్తున జనం కోఠీ చేరుకున్నారు. వెంటనే ముగ్గురు డాక్టర్లు చందర్,సయ్యద్ అలీ ,సీపీ రామయ్యను పంపింది ప్రభుత్వం . 'వారు నిజాం ఉంటున్న చిన్న చీకటి  గదిని చూసి ఆశ్చర్యపోయారట .పరిస్థితి గమనించి ఇంజెక్షన్ ఇవ్వడానికీ ,రక్తం పరీక్ష కోసం చేసిన ప్రయత్నాన్ని ఆయన  తిరస్కరించినట్టు చెబుతారు. చివరకు ఆ డాక్టర్ల బృందం పరిస్థితి చేయి దాటిపోయినట్టు ప్రభుత్వానికి తెలిపింది . 


కోఠీ చుట్టూ పోలీస్ బందోబస్తు పెట్టి లండన్‌లో ఉంటున్న నిజాం మనవడు ముఖరం జాను రప్పించారు. ఆయనతో నిజాం మాట్లాడలేకపోయారట . చివరికి అనేక ఉద్వేగ భరిత క్షణాల మధ్య హైదరాబాద్ ఆఖరి నిజాం  1967 ఫిబ్రవరి 24 న మధ్యాహ్నం ఒంటిగంటకు తుది శ్వాస విడిచారు. 


ప్రపంచమే గొప్పగా చెప్పుకున్న తుదియాత్ర :


నిజాం చనిపోయాక ఆయన భౌతిక కాయాన్ని ప్రజలు సందర్శించేలా కొంతసేపు బయట పెట్టాలని అధికారులు భావించారు . దీనికి నిజం కుటుంబసభ్యులు అంగీకరించలేదు. నిజాంపై ప్రజలకున్న అభిమానం చూసి వారు ఒప్పుకున్నారు . భౌతిక కాయాన్ని ఒక మిలటరీ వాహనంపైన ఉంచి కింగ్ కోఠీ నుంచి జుడీ మసీద్ వరకు అంతిమ యాత్ర జరిపారు.ఆ యాత్రను చూడడానికి అక్షరాల పదిలక్షల మంది వచ్చారని అప్పట్లో అధికారులు లెక్కలు వేశారు . 


ఆ జనం మధ్యన అతి నెమ్మదిగా జుడీ మసీద్ చేరిన నిజం భౌతిక కాయాన్ని ఆయనకు  నమ్మకమైన  ఇద్దరు నౌకర్లు నెమ్మదిగా సమాధిలోనికి దించారు.చిన్న వయసులో మరణించిన నిజాం కుమారుల్లో ఒకరైన జవాద్ స్మృతిలో నిర్మించిన మసీద్ అది . ఆయన భౌతిక కాయం పై చివరిసారిగా మనవడు ముఖరం జా ఇతర కుటుంబ సభ్యులు తలా కాస్తా మట్టిని వేసి అంత్యక్రియలు పూర్తి చేశారు.  దీం తో ఒక శకం చరిత్రలోకి నిశ్శబ్దంగా జారుకుంది . 


ఇంతకూ నిజాం  మంచివాడా .. చెడ్డవాడా :


జవాబు లేని ప్రశ్న ఇది . అయితే ఆనాటి పరిస్థితుల ప్రభావానికి లోనైన ఒక పాలకుడిగా మాత్రం చెప్పవచ్చు . ఆనాటి పాలకుల్లోని మంచీ చెడూ రెండూ ఆయనలోనూ ఉన్నాయి . అలాగే ప్రజాకంటకుడిగా .. నియంతగా ... ప్రచారం జరిగిన నిజాం కీ  చనిపోయిన తర్వాత తన మరణ యాత్రకు  10 లక్షల మంది జనాన్ని వచ్చేలా అభిమానాన్ని పొందిన నిజాంకూ మధ్య పోలిక కనిపించదు . ఇక ఈ కథనాన్ని ముగుంచేముందు .. రెండు విశేషాలు  నిజాం గురించి చెప్పుకుందాం  .. !


1)1947లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ -2 వివాహం సందర్బంగా నిజాం ఇచ్చిన గిఫ్ట్ అత్యంత ఖరీదైన వజ్రాలు పొదిగిన ఒక వెలకట్టలేని నెక్లెస్ . దాన్ని ఆమె ఇప్పటికీ మెడలో ధరిస్తుండడం విశేషం . 


2) 1965లో భారత దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ కోరిక మీద 425 కేజీల బంగారాన్ని నేషనల్ డిఫెన్స్ గోల్డ్ స్కీం లో  6. 5 % వడ్డీపై ఇన్వెస్ట్ చేశారు. 


3)పూణె లోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన భగవత్ గీత పబ్లికేషన్ కు డబ్బు అవసరం అని తెలుసుకుని 1933 నుంచి ఏటా 1000 రూపాయల చొప్పున వరుసగా 11 ఏళ్లు విరాళం ఇచ్చారట మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ .. !