Hyderabad IT Companies: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో వర్షాలు మరోసారి దంచికొడుతున్నాయి. నిన్న సాయంత్రం కొంత సమయం కురిసిన వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వర్షాల కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటున్న ఐటీ కారిడార్ ఏరియాలో ఉద్యోగులు లాగౌట్ చేయడంపై పోలీస్ శాఖ కీలక సూచనలు చేసింది. ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు మంగళవారం, బుధవారం 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది. కంపెనీల వివరాలను ఇలా పేర్కొన్నారు. ఇప్పటికైనా లాగౌట్ చేయనివారు పోలీస్ శాఖ సూచనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.
ఫేజ్ - 1 ప్రకారం.. ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగౌట్ చేసుకోవాలని సూచించారు.
ఫేజ్ - 2 ప్రకారం.. ఐకియా నుంచి బయో డైవర్సిటి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ సంబంధిత ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవడం బెటర్.
ఫేజ్ - 3 ప్రకారం.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ కంపెనీల ఉద్యోగులు సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల మధ్య లాగౌట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది.
వర్షాల నేపథ్యంలో ప్రజలకు పోలీసులు, అధికారుల కీలక సూచనలివే..
ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లకూడదని ప్రజలకు తెలంగాణ పోలీసులు సూచించారు. ముఖ్యంగా వర్షం కురుస్తున్న సమయంలో పాత భవనాల కింద, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండకూడదని హెచ్చరించారు. దాని వల్ల పిడుగులు పడటం లేక పాత ఇల్లు కూలిపోయి ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. కరెంట్ స్తంబాలు, ట్రాన్స్ ఫార్మర్స్, కరెంటు తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. వర్షం కారణంగా వాహనాలు రోడ్లపై స్కిడ్ అయ్యే అవకాశం ఉందని, కనుక కాస్త నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలని వావాహనదారులకు సూచించారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని, బుధవారం సైతం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీస్ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.
ఆకస్మిక భారీవర్షంతో సోమవారం రోడ్లన్నీ జలమయం కావటంతో వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే ఐటి ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నేరుగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం తెలిసిందే.