Hyderabad News: హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ వృద్ధి గణనీయంగా నమోదవుతంది. ఇప్పటికే చాలా వరకు రాష్ట్ర రాజధాని రూపు రేఖలు మారిపోయాయి. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనుల వల్ల మరింతగా అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరానికి మరో పౌర విమానాశ్రయ అవసరాన్ని గుర్తించిన కేబినెట్.. హైదరాబాద్ లో రెండో పౌర విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. త్వరలోనే హైదరాబాద్ రెండు వాణిజ్య విమానాశ్రయాలు ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ చేరే అవకాశం కనిపిస్తోంది. 


హకీంపేట్ లోని డిఫెన్స్ ఎయిర్ పోర్టును పౌర విమానయానం కోసం ఉపయోగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ప్రతిపాదనలపై త్వరలోనే రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమైంది. సుమారు 5 గంటలకు పైగా కేబినెట్ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలోనే ఈ విమానాశ్రయం గురించిన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏటా 2.5 కోట్ల మంది ప్రయాణికుల అవసరాలను తీరుస్తోంది. నగరం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో రెండో విమానాశ్రయం అవసరమని మంత్రివర్గం భావించింది. ప్రస్తుతం దేశంలో రెండు పౌర విమానాశ్రయాలు ఉన్న నగరాలు రెండే ఉన్నాయి. ఒకటి దేశ రాజధాని ఢిల్లీ కాగా.. రెండోది గోవా. 


ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కాకుండా ఢిల్లీలో మరో వాణిజ్య విమానాశ్రయం హిండన్ ఎయిర్ పోర్టు కూడా ఉంది. గోవాలో కూడా రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. దబోలిమ్ విమానాశ్రయం, మనోహర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు ఉన్నాయి. 


Also Read: Waterfalls in Telangana: తెలంగాణలో టాప్ 10 Waterfalls, ఈ వర్షాకాలంలో తప్పకుండా వెళ్లి ఆస్వాదించండి


కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు 


హైదరాబాద్ భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రజా రవాణాను మరింత సులువు చేయడానికి నగరంలో చేపట్టాలని తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల వివరాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ మెట్రోను వివిధ ప్రాంతాలకు విస్తరిస్తామని వివరించారు. కొన్ని మార్గాల్లో కింది నుంచి రోడ్డు, పై నుంచి మెట్రో రైలు వెళ్లేలా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ లో ప్రజా రవాణా దేశంలోనే అత్యంత మెరుగ్గా ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని కేటీఆర్ వివరించారు. మెట్రో విస్తరణలో భాగంగా మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో ఇటు ఇస్నాపూర్ వరకూ, అటు పెద్ద అంబర్ పేట్ వరకూ (విజయవాడ మార్గంలో) మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.  నిజామాబాద్ మార్గంలో జేబీఎస్ నుంచి కండ్లకోయ (ఓఆర్ఆర్) వరకూ విస్తరిస్తామని వివరించారు. ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ పనులకు శంకుస్థాపన జరిగిందని, అక్కడి నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ వరకూ మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కందుకూరు వరకూ మెట్రోను పొడిగిస్తామని వివరించారు. ఇటు వరంగల్ మార్గంలో తార్నాక నుంచి యాదాద్రి జిల్లా బీబీ నగర్ వరకూ, ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకూ మెట్రో లైనును పొడిగిస్తామని వివరించారు.