ICRISAT intern awarded in USA: మన దేశంలో వివిధ మొక్కలను రోగాల నుంచి రక్షించుక్లోవడానికి ఉపయోగిస్తుంటాం. మరి కొన్ని మొక్కలతో, చెట్లతో పలు వ్యాధులకు చికిత్స కూడా చేస్తుంటారు. వేప చెట్టు ఆకుల నుంచి తయారు చేసే కషాయాన్నిపొలాల్లో చల్లుతూ ఉంటారు. ఇలా ఓ మొక్క నుంచి బయో క్రిమి సంహరకం తయారు చేసి ఔరా అనిపించాడు ఓ కుర్రాడు. ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ సెమి-ఎరిడ్ ట్రాపిక్స్)లో రీసెర్చ్ ఇంటర్న్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ లో మూడవ బహుమతి పొందాడు. దాంతో పాటు 1000 అమెరికన్ డాలర్లను సైతం అందుకున్నాడు.


హైదరాబాద్ లోని FIITJEE జూనియర్ కాలేజీ లో చదువుతున్న సర్వేశ్ ప్రభు అనే విద్యార్థి కీటకశాస్త్రం విభాగానికి సంబంధించి ఇక్రిశాట్‌లో ప్రయోగాలు చేశాడు. రామాఫలం(రాంఫాల్)గా పిలిచే (Annona reticulata) అనే మొక్క నుంచి క్రిమి కీటకాలను నాశనం చేసే మందును తయారుచేశాడు. భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తూ అమెరికాలోని ఇంటర్నేషనల్ సైన్సు అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ లో ప్రదర్శించగా మూడవ బహుమతి గెలుచుకున్నాడు సర్వేశ్ ప్రభు.


భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం విద్యార్థి సర్వేశ్ ప్రభుకు అవార్డు సైతం అందించింది. స్కూల్ పిల్లలకు అందించే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇన్నోవేషన్ అవార్డులో భాగంగా అతనికి మొదటి బహుమతితో పాటు రూ.1 లక్ష అందించింది.


రాంఫాల్ చెట్టు ఆకుల నుంచి తయారు చేసే క్రిమి సంహారకాలు కాయ తొలుచు పురుగు, పచ్చ పెను బంక పురుగు, కత్తెర తెగుళ్లను నియంత్రించడానికి దోహదపడతాయి. ఈ క్రిమి సంహారకం వాడగా కీటకాల మరణాల రేటు 78-88 శాతంగా ఉందని పరిశోదనలో తేలింది. ఈ పురుగులు పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కాయ తొలుచు పురుగుల వల్ల ప్రతి ఏటా ౩౦౦ మిలియన్ల డాల్లర్ల నష్టం జరుగుతుందని వ్యవసాయ శాఖ నిపుణులు అంచనా వేశారు. పచ్చ పెను బంక పురుగు వివిధ రకాల పంటల్లో 38-42 శాతం వరకు దిగుబడిని తగ్గిస్తుంది. తెగుళ్లను సరైన సమయానికి గుర్తించి, క్రిమి సంహారక మందులను రైతులు పిచికారీ చేయకపోతే 21- 53 శాతం వరకు పంటకు నష్టం కలిగిస్తుంది. భారత వ్యవసాయ రంగం పై తెగుళ్లు 2018 లో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. మొక్కజొన్న పంట పై చూపిన ప్రభావం వల్ల పౌల్ట్రీ, పశుగ్రాస అవసరాలను తీర్చడానికి వీదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.


ప్రయోగశాలలో 78-88 శాతం వరకు తెగుళ్లతో కూడిన క్రిమి కీటకాల మరణాల రేటును నమోదు చేయడంలో ఇక్రిశాట్ ఇంటర్న్ సర్వేశ్ ప్రభు రూపొందించిన ఈ క్రిమి సంహారకారి దోహదం చేసింది. తరువాత దశలో బయట పరిస్థితుల్లో ఎలా పని చేస్తుందో పరీక్షించి చూడాలి" అని ఇక్రిశాట్ క్రాప్ ప్రొటెక్షన్ అండ్ సీడ్ హెల్త్ ప్రతినిది రాజన్ శర్మ తెలిపారు. బయో క్రిమి సంహారకాలు ఎటువంటి కృతిమ మందులు వాడకుండా దిగుబడి పొందడానికి దోహదపడతాయి. వీటి వల్ల రైతులకు పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఇలాంటి ఆవిష్కరణలు అన్నదాతల ముఖాల్లో వెలుగులు నింపుతాయి.


'అనోనా రెటిక్యులాటా యొక్క బయో-క్రిమి సంహారక లక్షణాలపై అధ్యయనం' పేరుతో రూపొందించిన ప్రాజెక్ట్ రాంఫాల్ మొక్క ఆకుల నుంచి తయారుచేసిన క్రిమిసంహారక మందు గురించి తెలుపుతుంది. తక్కువ ఖర్చుతో సంప్రదాయ రీతిలో రూపొందించే ఈ క్రిమి సంహారక మందు పంటలకు పట్టే చీడపీడలతో పాటు తెగుళ్లను నాశనం చేయడంలో రైతులకు ఎంతో ప్రయోజనకారి. ఈ మొక్క వివిధ భాగాలను విరేచనాలు,  పెడిక్యులోసిస్ వంటి వ్యాధుల చికిత్సకు సైతం ఉపయోగిస్తారు.