Mehdipatnam Asif Nagar Ganja Youth On Police Vehicle: హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్‌లో అర్ధరాత్రి వేళ కొందరు యువకులు పోలీసుల్ని టెన్షన్ పెట్టించారు. పోలీసు వాహనాలు ఎక్కి గంతులు వేశారు. ఆ సమయంలో పోలీసులు వాహనం లోపలే ఉన్నారు. ఆ కదులుతున్న వాహనంపైనే ఓ యువకుడు కూర్చొని హంగామా చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జిర్రా ప్రాంతంలో రాయల్సీ హోటల్ దగ్గర సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఆ యువకులు గంజాయి పీల్చి.. ఆ మత్తులో ఒళ్లు తెలియకుండా ఇలా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది.


గంజాయి మత్తులో ఉన్న యువకులు అంతకుముందు రోడ్డున పోయే వాహన దారులపై దాడులు చేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కొన్ని వాహనాల అద్దాలను యువకులు పగులగొట్టారు. ఆ యువకులను పలువురు అడ్డుకోబోయే ప్రయత్నం చేసినా వారిపైనా దాడికి యత్నించారు. చివరికి పెట్రోలింగ్ కోసం అక్కడికి వచ్చిన పోలీసులపైనా దాడి చేశారు. పోలీసు వాహనం పైకి ఎక్కి నానా హంగామా సృష్టించారు. ఎట్టకేలకు గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో లాఠీలకు పని చెప్పారు. అజయ్‌ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎడాపెడా వాయించారు. 


చివరికి పోలీసులు ఈ యువకులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గంజాయి తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అసలు వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో పోలీసులు వివరాలను రాబడుతున్నారు.