Hyderabad Disaster Response and Assets Monitoring and Protection (HYDRA) హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు, చెరువులు, ఇతర జలాశయాల స్థలాలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేయడం తెలిసిందే. గత కొన్ని రోజులుగా హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో శనివారం నాడు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి హైడ్రా సిబ్బంది నేలమట్టం చేయడం వివాదాస్పదమైంది.
ఇప్పటివరకూ మొత్తం 18 చోట్ల కూల్చివేతలు, ఎవరివంటే!
చెరువులు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ సమర్పించింది. ఇప్పటివరకూ మొత్తం 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా తమ నివేదికలో పేర్కొంది. 43.94 ఎకరాల కబ్జా భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని తెలిపారు. కూల్చిన కట్టడాలలో పల్లంరాజు, నటుడు నాగార్జున, సునీల్రెడ్డికి చెందిన నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా కమిషన్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. వారితో పాటు కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు తమ రిపోర్ట్ లో హైడ్రా పేర్కొంది. బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజులరామారం, లోటస్పాండ్, మన్సూరాబాద్, అమీర్పేట్ ఏరియాలలో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం: రంగనాథ్
ప్రభుత్వం గతంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసులు ఇచ్చిందని, వాటిపై తాము చర్యలు తీసుకుంటున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. పలువురు ప్రముఖులకు సంబంధించిన కట్టడాలను కూల్చివేయడం, అవి కూడా కాంగ్రెసేతర నేతలవి మాత్రమే అని జరుగుతున్న ప్రచారంపై ఐపీఎస్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా ఏర్పాటుకు ముందువరకు జీహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండీఏ సంబంధిత అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యల్లో భాగంగా నోటీసులు ఇవ్వగా, వాటిపై తాము తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
హైడ్రా ఎవరినీ లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేపట్టడం లేదని, అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రస్తుత స్టేటస్ తెలుసుకుని చట్ట ప్రకారం వాటిపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని.. అందులో చిన్నాపెద్దా, ప్రముఖులు, సామాన్యులు అంటూ తమకు ఏ వ్యత్యాసం ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకూ 18 చోట్ల కూల్చివేతలు జరపగా, అందులో ప్రముఖుల కట్టడాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది.