N Convention Demolition: ఎన్ కన్వెన్షన్‌ అక్రమ నిర్మాణమే, ఎలాంటి అనుమతే లేదు- కూల్చివేతపై Hydra ప్రకటన

N Convention Centre Demolision | నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడంపై హైడ్రా అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. అది అక్రమ నిర్మాణమని, కోర్టు స్టే కూడా లేదని స్పష్టం చేశారు.

Continues below advertisement

N Convention encroached land GHMC has not given building permission | హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వివాదాస్పదం అవుతోంది. అది పట్టా భూమి అని, అందుకే నిర్మాణం చేపట్టినట్లు నాగార్జున చెబుతున్నారు. కోర్టులో స్టే ఉన్నా, హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారని ఆయన ఆరోపించారు. అయితే అక్కడ భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించినట్లు హైడ్రా స్పష్టం చేసింది. కూల్చివేతపై కీలక ప్రకటన చేసింది. FTL పరిధిలో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాల 18 గుంటల భూమిని ఎన్ కన్వెన్షన్ ఓనర్ ఆక్రమించినట్లు హైడ్రా తెలిపింది. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. పైగా, ఏ కోర్టు సైతం ఎన్ కన్వెన్షన్ పై స్టే ఇవ్వలేదని, అన్ని వివరాలు పరిశీలించాక చర్యలు చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

Continues below advertisement

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అక్రమ నిర్మాణాలు, చెరువులు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. గత కొంతకాలం నుంచి హైడ్రా అక్రమ నిర్మాణాలను, చెరువులు, ఇతర కుంటలు ఎఫ్‌టీఎల్ పరిధిలోగానీ, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. తాజాగా శనివారం నాడు మాదాపూర్, ఖానామెట్ గ్రామంలోని తమ్మిడికుంట చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ తో పాటు పలు పర్మిషన్ లేని, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లో నిర్మాణాలను సిబ్బంది నేలమట్టం చేసింది.

2014లో హెచ్ఎండీఏ తమ్మిడికుంట చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL), బఫర్ జోన్‌లో నిర్మాణాలపై నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది. 2014లో నోటిపికేషన్ తరువాత ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఓనర్ హైకోర్టును ఆశ్రయించగా.. చట్ట ప్రకారం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న వాటిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఓనర్ సమక్షంలో ఎఫ్‌టీఎల్ పరిధిలపై సర్వే చేసి, వారికి రిపోర్ట్ ఇచ్చారని హైడ్రా తెలిపింది. సర్వే రిపోర్టుపై ఎన్ కన్వెన్షన్ 2017లో మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లో ఉంది. కానీ ఏ కోర్టులోనూ ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోకూడదని స్టే లేదని స్పష్టం చేసింది.  
Also Read: Akkineni Nagarjuna: హీరో నాగార్జునకు ఊరట - ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే

ఉదయం కూల్చివేశాం, మధ్యాహ్నం కోర్టు స్టే  
ఎన్ కన్వెన్షన్ యజమానులు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలు చేపట్టి కమర్షియల్ గా వినియోగించారని హైడ్రా పేర్కొంది. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఎలాంటి అనుమతి ఇవ్వకున్నా కబ్జా చేసిన చోట నిర్మాణాలు చేపట్టారని హైడ్రా సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (BRS) కింద క్రమబద్ధీకరణ చేసుకోవాలని యత్నించినా ప్రయోజనం లేకపోయింది. అధికారులు రెగ్యూలరైజ్ చేయడానికి నిరాకరించారు. వర్షా కాలంలో తమ్మిడికుంట చెరువు చుట్టుపక్కల వరద నీరు చేరుతుంది. చాలా ఇళ్లలోకి నీరు చేరి, స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారని పేర్కొంది. శనివారం ఉదయం హైడ్రా అధికారులు, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ సహా పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్ కన్వెన్షన్ పై హైకోర్టు మధ్యాహ్నం స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

Continues below advertisement
Sponsored Links by Taboola