Hyderabad Customs: యువత మత్తుకు బానిసలుగా మారి జీవితాన్ని కోల్పోతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా మత్తుకు బానిసలుగా మారుతున్న ఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం. పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు మత్తు పదార్థాల కట్టడి చర్యలు తీసుకుంటున్నా.. కొత్త కొత్త దారుల్లో డ్రగ్స్ సేవిస్తూ మైకంలో మునిగిపోతున్నారు. తాజాగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ అధికారులు భారీ స్థాయిలో మత్తు పదార్థాలను ధ్వంసం చేశారు. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ సమీపంలోని వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు వద్ద 9 వేల కిలోల డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలను కాల్చి ధ్వసం చేశారు. 






కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నషా ముక్త్ భారత్ పఖ్వాడా, సే నో టూ డ్రగ్స్ ప్రచారంలో భాగంగా గతంలో పట్టుకున్న డ్రగ్స్ ను ఈ మేరకు హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ధ్వంసం చేశారు. దాదాపు 8946.263 కిలోగ్రాముల బరువున్న వివిధ రకాల మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను నాశనం చేశారు. ఈ మత్తు పదార్థాలను వివిధ సందర్భాల్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, హైదరాబాద్, అలాగై హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ధ్వంసం చేసిన వాటిలో 2655.942 కిలోల గంజాయి, 11 కిలోల హెరాయిన్, 409.39 కిలోల అల్ప్రాజోలం సంబంధిత పదార్థాలు, 142.932 కిలోల ఎఫెడ్రిన్ హైడ్రోక్లోరైడ్ సంబంధిత పదార్థాలు, 74.92 కిలోల కెటామైన్ హైడ్రోక్లోరైడ్, 2.956 కిలోల మెఫెడ్రోన్, 53.983 కిలోల మెథక్వలోన్, 5595.14 కిలోల ఎఫెడ్రిన్ ను తయారు చేయడానికి ఉపయోగించి రసాయనాలు ఉన్నాయి. ఇందులో రూ. 77 కోట్ల విలువైన 11 కిలోల హెరాయన్ ను గతేడాది ఏప్రిల్, మే నెలల్లో మలావి, టాంజానియా, అంగోలా దేశాల పౌరుల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 










హైదరాబాద్ లో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ యథేచ్ఛగా సరఫరా అవుతూనే ఉంది. ఉక్కుపాదం మోపుతున్నా కొత్త దారుల్లో మాదక ద్రవ్యాలు నగరంలోకి వస్తున్నాయి. యువతకు డ్రగ్స్ అలవాటు చేసి వారు మత్తుకు బానిసలుగా మారిన తర్వాత వారితోనే డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నారు. వారినే ఏజెంట్లుగా మార్చి మత్తు పదార్థాలను నగరంలోకి సరఫరా చేస్తున్నారు. యువతే ఏజెంట్లుగా మారుతుండటంతో పోలీసులు వారిని పట్టుకోవడం కష్టంగా మారుతోంది. బానిసలుగా మారిన యువతతో సరఫరా దారులు చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నారు. మత్తు పదార్థాల కోసం, వాటిని సరఫరా చేస్తే వచ్చే డబ్బు కోసం యువత ఈ దారి ఎంచుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొందరు వ్యక్తులు ప్రణాళిక ప్రకారం కుర్రాళ్లకు డ్రగ్స్ ను అలవాటు చేస్తున్నారు. పదే పదే డ్రగ్స్ ఇచ్చి వారు ఇక మత్తు లేకపోతే ఉండలేని పరిస్థితిలో వారితో అక్రమాలు చేయిస్తున్నారు. మత్తు మఠాల వలలో చిక్కుకున్న యువత అందులోని మత్తుకు, వాటి నుంచి వచ్చే డబ్బుకు అలవాటు పడి అదే రొంపిలో ఉండిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.