Hyderabad Crime Report 2023:హైదరాబాద్ (Hyderabad) తెలంగాణకు గుండెకాయ లాంటిది. అలాంటి భాగ్యనగరంలో నేరాలు పెరిగినట్లు పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. 2021, 2022 సంవత్సరాలతో పోలిస్తే నేరాలు తగ్గడం సంగతి అటుంచితే, పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను నూతన సీపీ కొత్త శ్రీనివాసరెడ్డి (Kothakota Srinivas Reddy)  విడుదల చేశారు. నూతన సంవత్సర వేడుకలను అర్ధరాత్రి ఒంటి గంట లోపు ముగించాలని సూచించారు. నిబంధనలను అధిగమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కోటిక్‌ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోందని, సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటామన్నారు.


మహిళలపై పెరిగిన నేరాలు
2022తో పోలిస్తే, ఈ ఏడాది 2 శాతం నేరాలు పెరిగాయి. స్థిరాస్తి నేరాలు కూడా అంతకు మించి నమోదయ్యాయి. ఈ ఏడాది హత్యలు తగ్గి, స్థిరాస్తి సంబంధిత నేరాలు 3 శాతం  పెరిగినట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామన్న ఆయన, అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళలపై నేరాలు 12 శాతం పెరిగాయి. మహిళలపై 2022లో 343 అత్యాచార కేసులు నమోదు కాగా, ఈ ఏడాది వాటి సంఖ్య 403కు చేరిందన్నారు. అంటే 60కేసులు ఎక్కువ రికార్డయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు పెరిగడంతో...వాటిని అంతేవేగంతో పరిష్కరిస్తున్నారు పోలీసులు. ఈ ఏడాది 9 శాతం దోపిడీలు పెరిగితే, పోక్సో కేసులు 12 శాతం తగ్గాయి. ఆర్థిక నేరాలు 2022లో 292 కేసులు నమోదైతే, 2023లో ఆ కేసుల సంఖ్య 344కి చేరింది. సైబర్‌ నేరాలు ఊహించని విధంగా 11 శాతం పెరిగాయి. 


4,909 చీటింగ్‌ కేసులు నమోదు
2022లో సైబర్‌ నేరాల్లో రూ.82 కోట్లు ప్రజలు మోసపోయారు.  51 కోట్లు అధికంగా దోచేశారు సైబర్ నేరగాళ్లు. అంటే రూ.133 కోట్లు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. దేశంలో మొదటిసారిగా సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ను ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. సైబర్‌ సెక్యూరిటీపై నిపుణులను పిలిచి అవగాహన కల్పించారు. ఈ ఏడాది 79 హత్యలు, 403 రేప్‌ కేసులు, 242 కిడ్నాప్‌లు, 4,909 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి.  2వేల 637 రోడ్డు ప్రమాదాలు, 262 హత్యాయత్నాలు, 91 దొంగతనాలు జరిగాయి. నగర ప్రజలు పోగొట్టుకున్న సొత్తులో 75 శాతం రికవరీ చేశారు పోలీసులు. ఏడాది కాలంలో 63 శాతం నేరస్థులకు శిక్షలు పడితే...అందులో 13 మందికి జీవిత ఖైదు పడింది. వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లుగా రికార్డయింది. 


ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్‌ సరఫరా ముఠాల కార్యకలాపాలను సహించేది లేదని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. పబ్స్‌, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌ యజమానులు...డ్రగ్స్ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. డ్రగ్స్‌ ముఠాలు సరఫరాను బంద్ చేయాలని,  డ్రగ్స్ ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ మూలాలుంటే సహించేది లేదని,  దీనిపై సినీ రంగానికి చెందిన పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. ఉల్లంఘించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.