Hyderabad Crime News: సాధారణంగా స్నేహితులు అంటే ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ప్రాణ మిత్రులు అయితే ప్రాణ త్యాగాలు కూడా చేసుకుంటారు. మరీ పెద్ద, పెద్ద విషయాలు అయితే తప్ప గొడవ పడరు. ఒకవేళ పడినా మళ్లీ తమను తామే సమాధాన పరుచుకుంటారు. కానీ ఓ ఘటనలో మాత్రం ఇద్దరు స్నేహితులు.. చిన్న దాని కోసమే చితక్కొట్టుకున్నారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పాతబస్తీ పరిధిలో విద్యార్థులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఒక విద్యార్థి మరో విద్యార్థిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కింద పడేసి పిడిగుద్దులు కురిపించాడు. ఆ విద్యార్థి దాడికి తాళలేక బాధిత స్టూడెంట్ అక్కడే కుప్పకూలిపోగా.. తోటి విద్యార్థులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పాతబస్తీ ఛాదర్‌ఘాట్ పరిధిలో నివాసం ఉండే కసబ్, ఆరిఫ్ అనే విద్యార్థులు ఇద్దరు స్నేహితులు, ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారు. ఎస్ఐఎస్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఆరిఫ్, కసబ్ సహ విద్యార్థులు కూడా. ఇద్దరూ మంచి స్నేహితులు. కాగా, ప్రస్తుతం కాలేజీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలే ఆ ఇద్దరు స్నేహితుల మధ్య కలహానికి దారి తీశాయి. ఆరిఫ్, కసబ్ ఇద్దరూ పరీక్ష రాస్తున్న సమయంలో కసబ్.. ఆరిఫ్ నుంచి చీటి అడిగాడు. అయితే, ఆరిఫ్ చీటి ఇవ్వకపోవడంతో పరీక్ష హాలులోనే కసబ్ కోపంతో ఊగిపోయాడు. పరీక్ష అయిపోయాక నీ సంగతి చూస్తా అనుకున్నాడు. 






పరీక్ష అయిపోగానే విద్యార్థులు అంతా పార్కింగ్ సెల్లార్ లో కలుసుకున్నారు. ఈ క్రమంలో పరీక్ష సమయంలో తనకు చీటి అందించకపోవడంపై కసబ్.. ఆరిఫ్ ను నిలదీశాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అప్పటికే ఆవేశంతో ఊగిపోతున్న కసబ్.. ఆరిఫ్ పై దాడికి తెగబడ్డాడు. స్నేహితుడు అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టాడు. ఆరిఫ్ ను బలంగా కింద పడేసి ముఖంపై, తలపై పిడిగుద్దులు కురిపించాడు. కసబ్ దాడికి తాళలేక ఆరిఫ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు కసబ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రక్తమోడుతున్న ఆరిఫ్ ను నడవలేని స్థితిలో అక్కడి నుంచి విద్యార్థులు మోసుకెళ్లారు. స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే కసబ్ తీవ్రంగా కొట్టడంతో.. ఆరిఫ్ మెదడులో రక్తం గడ్డకట్టిందని, ప్రస్తుతం ఆరిఫ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆరిఫ్ తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఛాదర్ ఘాట్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కాలేజీ పార్కింగ్ సెల్లార్ లో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజీని సేకరించారు. ఇందులో ఆరిఫ్ ను కసబ్ మీద పడి కొడుతున్న దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజి ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.


Read Also: ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీంద్ర మృతి