తెలంగాణలో ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల గడువు పొడిగిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబరు 7న ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంబీబీఎస్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. సీట్ల కేటాయింపు పూర్తి అయిన తర్వాత కళాశాలలో చేరేందుకు సెప్టెంబరు 7 వరకు గడువు ఇవ్వగా..  అభ్యర్థులు, తల్లిదండ్రులు గడువు పెంచాల్సిందిగా ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావును కోరారు. అదేవిధంగా ఎంబీబీఎస్ మూడో విడత కౌన్సిలింగ్ లోనూ తమకు అవకాశం కల్పించాలని, లేదంటే మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని మంత్రికి వివరించారు. 


ఈ విషయంలో మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారు. అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకొని రెండో దశలో చేరే వారికి అప్ గ్రేడేశన్‌కు అవకాశం కలిపిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రెండవ విడతలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన అభ్యర్థులకు శుక్రవారం (సెప్టెంబరు 8న) సాయింత్రం వరకు గడువు పొడగించాలని, మూడవ విడత కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని కాళోజీ యూనివర్సిటీ ఉపకులపతిని ఆదేశించారు. ఈ మేరకు యూనివర్సిటీ కళాశాలలో చేరేందుకు గడువు పొడిగించింది.


అలాగే మంత్రి ఆదేశాల మేరకు అభ్యర్థులకు మూడో విడత కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామని కాళోజీ విశ్వవిద్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు ఇది గమనించి ఒక్క రోజు గడువు పొడగించినందున శుక్రవారం సాయింత్రంలోగా సంబంధిత ధ్రువపత్రాలతో కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించింది.


ALSO READ:


సెప్టెంబరు 8 నుంచి ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం, షెడ్యూలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఐసెట్‌-2023 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 8 నుంచి ప్రారంభంకానుంది. ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 8 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులకు సెప్టెంబరు 9 - 16 మధ్య ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు సెప్టెంబరు 12న అర్హత పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ సెప్టెంబరు 19 నుంచి 21 వరకు కొనసాగనుంది. సెప్టెంబరు 22న వెబ్ఆప్షన్లలో మార్పునకు అవకాశం ఇచ్చి, సెప్టెంబరు 25న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 26న కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 27 నుంచి తరగతులు ప్రారంభంకాన్నాయి.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'గేట్‌-2024' దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం, ప్రారంభం ఎప్పుడంటే?
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ వాయిదాపడింది. ఆగస్టు 24 నుంచి ప్రారంభంకావాల్సిన దరఖాస్తు ప్రక్రియ వారంరోజులు ఆలస్యంగా మొదలుకానుంది. ఆగస్టు 30 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని ఐఐఎస్సీ బెంగళూరు వెల్లడించింది. ఈ ఏడాది కొత్తగా డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేపర్‌ను ప్రవేశపెట్టారు. పరీక్షలను 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో నిర్వహించనున్నారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.
గేట్-2024 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..