Hyderabad Crime News: పోలీసులకు చిక్కకుండా పుష్ప సినిమాలో పుష్పరాజ్ వేసే ప్లాన్ తరహాలోనే హైదారబాద్ లో పలువురు అక్రమార్కులు గంజాయి తరలింపుకు ఓ ప్లాన్ వేశారు. కానీ సినిమాలో అది సక్సెస్ అయినా.. నిజజీవితంలో మాత్రం బెడిసి కొట్టింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు నలుగు నిందితులను అరెస్చ్ చేశారు. వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీ నగర్ లో విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు తెలిపారు. 


అసలేం జరిగిందంటే..?


హన్మకొండకు చెందిన బానోత్ వీరన్న, హైదరాబాద్ వాసులు కర్రె శ్రీశైలం, కేతావత్ శంకర్ నాయక్, వరంగల్ కు చెందిన పంజా సూరయ్య ముథాగా ఏర్పడి ఏపీలోని అన్నవరం నుంచి రాజమండ్రి, తొర్రూరు, తిరుమలగిరి, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఓ అదిరిపోయే ప్లాన్ వేశారు. డీసీఎం వాహనం లోపల మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించారు. అందులో గంజాయి ప్యాకెట్లను నింపుతున్నారు. దానిపై ఇనుప షీట్లు ఉంచి బోల్టుతో బిగిస్తున్నారు. ఆపై ఏదో ఓ లోడును తీసుకుని నగరానికి పయనం అవుతున్నారు. ఇలా ఆరుసార్లు గుట్టుగా గంజాయిని అనుకున్నచోటుకు తరలించారు. 


వాహనంలో గంజాయి తరలుతోందని చౌటుప్పల్ పోలీసులకు ఉప్పందింది. డీసీఎంకు ముందు ఓ హ్యుందాయ్ క్రెటా కారును పైలెట్ లో పంపిస్తూ.. జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందింది. శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చౌటుప్పల్ లోని వలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపు కాశారు. పైలెట్ గా వచ్చిన కారును అడ్డుకుని ఆ వెనకే వచ్చిన డీసీఎంను ఆపారు. అనుమానంతో వాహనం లోపలి భాగాన్ని కాలితో తన్ని చూడగా.. శబ్దంలో తేడా వచ్చింది. ఇనుప షీట్లపై బోల్టులు తొలగించడంతో 400 కిలోల గంజాయి ఉంది. కారులో వచ్చిన ఇద్దరితో పాటు డీసీఎంలో వెళ్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 


34 లక్షల రూపాయల విలువ చేసే స్మగ్లింగ్


కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఉప సర్పంచ్ సహా నలుగురిని ఫిబ్రవరి 21వ తేదీన టాస్క్ ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 34 లక్షల రూపాయల విలువైన 170 కిలోల గంజాయి, ఒక కారు, గంజాయి రవాణాకు వినియోగించిన బోలెరో వాహనం, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో  రాయినేని శంకర్, ముసిక లక్ష్మణ్, మాట మహేష్, గండికోట సతీష్ ఉన్నారు.


అసలేం జరిగింది? 


ఈ అరెస్ట్ కు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ పి.కరుణాకర్ వివరాలను వెల్లడిస్తూ... నిందితుల్లో రాయినేని శంకర్, నీరుకుళ్ల గ్రామ ఉప సర్పంచ్ ముసిక లక్ష్మణ్ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగం నిందితులు మిగితా ఇద్దరు నిందితులతో కలిసి ఏపీలోని నర్సీపట్నంలోని నూకరాజు ద్వారా 170 కిలోల గంజాయిని కోనుగోలు చేసి దానిని రెండు కిలోల ప్యాకేట్ల చొప్పున బోలేరో వాహనంలో ఎవరికి అనుమానం రాకుండా కొబ్బరి బొండాల మధ్యలో రహస్యంగా భద్రపర్చి వరంగల్ కు తరలించారు. ఈ గంజాయిని వరంగల్ తరలించే క్రమంలో ప్రధాన నిందితులు శంకర్, ఉప సర్పంచ్ లక్ష్మణ్ మరో కారులో గంజాయికి తరలిస్తున్న కారుకు ఎస్కాట్ గా వ్యవహరించేవారు. పోలీసులకు అందిన సమాచారంతో టాస్క్ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు.. ఆత్మకూర్ గ్రామ శివారు ప్రాంతంలో నిర్వహించిన తనీఖీల్లో అనుమానస్పదంగా వస్తున్న నిందితులు వాహనాలను అదుపులోకి తీసుకోని తనిఖీ చేశారు. బోలేరో వాహనంలో కొబ్బరి బొండాల మధ్యలో గంజాయి ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.