తెలంగాణలో ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్ స్థాయి నియామక ప్రక్రియలో భాగంగా సాంకేతిక విభాగాలకు సంబంధించిన తుది రాతపరీక్షలు మార్చి 11న జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఎస్‌ఐ తుది రాతపరీక్ష మార్చి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఫింగర్ ప్రింట్ బ్యూరో (ఎఫ్‌పీబీ) ఏఎస్‌ఐ తుది రాతపరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్ర 5.30 గంటల వరకు జరగనుంది.


అభ్యర్థులు మార్చి 6న ఉదయం 8 గంటల నుంచి మార్చి 9న రాత్రి 12 గంటల వరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి సంబంధించిన వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో సూచించారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పాస్‌పోర్టు సైజ్ ఫొటో అతికించుకోవాలి. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 93937 11110 లేదా 93910 05006 నంబర్లలో సంప్రదించవచ్చు. ఐటీ అండ్ సీవో ఎస్‌ఐ, ఎఫ్‌పీబీ ఏఎస్‌ఐ తుది రాతపరీక్షకు సంబంధించిన మరో రెండు పేపర్ల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే తేదీలను మళ్లీ ప్రకటిస్తామని ఛైర్మన్ వివరించారు.


కానిస్టేబుల్  పోస్టుల భర్తీ నోటిఫికేషన్  మేరకు సాంకేతిక పోస్టులకు ప్రాథమిక రాతపరీక్ష లేదని పోలీసు నియామక మండలి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 16 వేలకు పైగా కానిస్టేబుల్  పోస్టుల నియామకానికి ఆగస్టు 28న రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్ష నుంచి ఐటీ &  కమ్యూనికేషన్  విభాగం (డ్రైవర్ /మెకానిక్ )లో 383 పోస్టులకు, అగ్నిమాపకశాఖ (డ్రైవర్ ఆపరేటర్)లో 225 పోస్టులకు రాత పరీక్ష మినహాయించారు. టెక్నికల్ పరీక్షల షెడ్యూలును పోలీసు నియామక మండలి తాజాగా విడుదల చేసింది.


మెయిన్ పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..


➥ మార్చి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (IT&CO) టెక్నికల్ పేపర్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ ఏఎస్‌ఐ(FPB) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.


➥ మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (PTO) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.


➥ ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు.


➥ ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు.


➥ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు.


➥ ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు.