Hyderabad Crime News: వారిద్దరికి చాలా ఏళ్ల కిందట పెళ్లైంది. వారి అన్యోన్య దాంపత్య జీవితానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే మూడ్రోజుల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య.. ఈ బాబు నీకు పుట్టలేదని చెప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. భార్య మొహంపై బీరు సీసాలతో దాడి చేశాడు. ఆమె కింద పడిపోగానే.. గొడ్డలి తీసుకొచ్చి అతికిరాతకంగా నరికాడు. ఆపై నెలన్నర రోజులున్న చిన్నారిని బయట ఉన్న నీటి సంపులో పడేసి చంపాడు. చివరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ కు తరలించారు. 


అసలేం జరిగిందంటే..?


రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ లో 23 ఏళ్ల లావణ్య, ధనరాజ్ నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె ఆద్య, కుమారుడు క్రియాన్ష్ ఉన్నారు. వీరంతా కలిసి మార్చి 15వ తేదీ బుధవారం నాడు అత్తవారింటిని నుంచి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బండరావిరాలలోని ఇంటి నుంచి అనాజ్ పూర్ కి తీసుకొచ్చే సమయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. అనాజ్ పూర్ లోని తమ ఇంటికి చేరుకున్న అనంతరం ఆమెతో గొడవ పెద్దది అయిందని.. ఈ సమయంలో భార్య లావణ్య తిట్టింది. ఆవేశంలో అసలు బాలుడు నీతో పుట్టిన వాడు కాదని చెప్పింది. దీన్నో అవమానంగా భావించిన ధనరాజ్‌... బీరు సీసాలతో దాడి చేశాడు. ఆ దెబ్బలకు అరుస్తూ లావణ్య కిందపడిపోయింది. వెంటనే వేరే గదిలోకి వెళ్లిన ధనరాజ్‌ అక్కడి గొడ్డలి చూశాడు. ఆవేశాన్ని ఆపుకోలేక దాన్ని తీసుకొని లావణ్యను అతికిరాతకంగా నరికేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాకు పసిబాలుడిపై పడ్డాడు. అక్కడే ఏడుస్తూ కనిపించిన బాబు క్రియాన్ష్ ను గది బయట ఉన్న నీటి సంపులో పడేశాడు. 


భార్య, కుమారుడిని హత్య చేయగానే బైకుపై పారిపోయిన ధన్ రాజ్ 


ఆపై అక్కడి నుంచి ద్విచక్ర వాహననంపై పారిపోయినట్లుగా ధన్ రాజ్ అంగీకరించినట్లు సమాచారం. భార్య అలా మాట్లాడటాన్ని భరించలేకే ఈ ఘోరానికి పాల్పడినట్లు, ఆమెపై తకు ఎలాంటి అనుమానం లేదని అతడు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అదనపు కట్నం కోసం వేధించాడని అత్తింటివారు ఆరోపిస్తున్నారు. తన బిడ్డ లావణ్యను, కుమారుడు క్రియాన్ష్ ను కిరాతకంగా హత్య చేసిన ధన్ రాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నా పిల్లాడితోపాటు పాతికేళ్ల తమ కూతురిని అల్లుడే దారుణంగా హత్య చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు.


లావణ్య తండ్రి నర్సింగరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. హత్య చేసిన అనంతరం సంఘీనగర్ మీదగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు ధన్ రాజ్. అవుటర్ రింగ్ రోడ్డుకు చేరుకొని సర్వీస్ రోడ్డు వెంట కొంత దూరం వెళ్లి అదే ప్రాంతంలో తిరిగి తిరిగి... చీకటి పడిన అనంతరం కోహెడ, తొర్రూర్ మీదుగా హయత్ నగర్ పీఎస్‌కు చేరుకున్నాడు.  పోలీసుల ఎదుటకు వెళ్లాడని సమాచారం. అక్కడి నుంచి అతన్ని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.