Hyderabad Crime News | హైదరాబాద్: బైకులు, సెల్ ఫోన్లు చోరీ అయితే చాలా వరకు ఆశలు వదిలేసుకుంటారు. ఎందుకంటే వాటిని పార్ట్స్ గా చేసి మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు కేటుగాళ్లు. అయితే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి టూవీలర్ చోరీ కాగా, నాలుగేళ్ల తరువాత ఊహించని షాక్ తగిలింది. వాహనంపై భారీగా చలానాలు ఉన్నాయని, రూ.22 వేలు కట్టాలంటూ ట్రాఫిక్ పోలీసుల నుంచి నోటీసులు రావడంతో ఓనర్ కంగుతిన్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి..


నాలుగు ఏళ్ల కిందట చోరికి గురైన ద్విచక్ర వాహనంపై రూ. 22 వేల ట్రాఫిక్ చలానా కట్టాలని పోలీసుల నుంచి నోటీసులు రావడంతో యజమాని కంగుతిన్నాడు. ఈ ఘటన నగరంలోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోయిన్ పల్లి ప్రాంతానికి చెందిన వెంకట్ రెడ్డి తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం హోండా యాక్టివా (AP10AR 8187) 2020 ఏప్రిల్ మాసంలో మాయమైంది. తన స్కూటీ కోసం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వెతికినా లాభం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే కొవిడ్ 19 కేసులు భారీగా పెరుగుతున్న సమయం, లాక్ డౌన్ కూడా రావడంతో ఏం చేయలేకపోయాడు. 


ట్రాఫిక్ పోలీసుల నుంచి చలానా నోటీసులు
నాలుగు సంవత్సరాల తరువాత బోయిన్ పల్లి ట్రాఫిక్ పోలీసుల నుంచి వెంకట్ రెడ్డికి నోటీసులు రావడంతో కంగుతిన్నాడు. నోటీసు 66 రోడ్డు ట్రాఫిక్ ఉల్లంఘనలకుగాను, రూ. 22 వేలు మొత్తం చెల్లించాలని అందులో పేర్కొన్నట్లు బాధితుడు తెలిపాడు. ఆ యాక్టివా విలువ దాదాపు రూ. 10వేలు ఉంటుందని, చలానా మొత్తం అంతకు డబుల్ వచ్చిందన్నాడు. బాధితుడు బోయిన్ పల్లి సివిల్ పోలీసులను ఆశ్రయించి తన యాక్టివా చోరీపై కేసు నమోదు చేయాలని మరోసారి ఫిర్యాదు చేశాడు. ట్రాఫిక్ చలాన్ ఆధారంగా ఆన్ లైన్ లో పరిశీలించగా ఎక్కువగా ఓల్డ్ సిటీ లోనే ఆ టూవీలర్ ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ద్విచక్ర వాహనంపైన ఒక టీవీ ఛానల్ స్టిక్కర్ తగిలించుకొని యధేచ్ఛగా తిరుగుతున్నట్లు పోలీసులు అతడికి తెలిపారు.


ఫైన్ అతడి నుంచి కట్టించుకోవాలన్న బాధితుడు


బాధితుడు మాట్లాడుతూ.. కొన్నేళ్ల కిందట నా బ్లాక్ యాక్టివా పోయింది. అప్పట్లో కరోనా టైమ్ కావడంతో ఏం చేయలేకపోయాను. పోలీసులు చెప్పారని పార్కింగ్ లలో, సమీప ప్రాంతాల్లో చెక్ చేశాను. అయితే తాజాగా రూ.22 వేల ట్రాఫిక్ చలానా కట్టాలని నోటీసులు వచ్చాయి. అంటే బైక్ ఇంకా వాడుతున్నారు. భవిష్యత్తులో ఆ బైక్ వాడుతున్న వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే అది నా మెడకు చుట్టుకుంటుంది. ఆ ట్రాఫిక్ చలానా డబ్బులు నిందితుడి వద్ద నుంచి కట్టించుకోవాలి. ఇప్పుడు నాకు బండి అయినా రావాలి. లేకపోతే ఆ వాహనం చోరీకి గురైనట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని’ పోలీసులను కోరాడు.





Also Read: Rajagopal Reddy: 'నా నాలుకపై పుట్టుమచ్చలు' - ఉత్తమ్ కచ్చితంగా సీఎం అవుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు