Raja Singh Sri Rama Navami Shobha yatra -హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏడాది హైదరాబాద్ తో పలు ప్రాంతాల్లో శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తుంటారు. బుధవారం (ఏప్రిల్ 17వ తేదీన) శ్రీరామనవమి శోభయాత్ర నిర్వహించుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పోలీసులను ఇదివరకే అనుమతి కోరారు. కానీ రాజా సింగ్ రిక్వెస్ట్‌ను పోలీసులు తిరస్కరించారు. రాజా సింగ్ శోభాయాత్ర నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారు హైదరాబాద్‌ నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. లేఖ గమనిస్తే.. ఏప్రిల్ 14వ తేదీనే రాజా సింగ్ నిర్వహించాలనుకున్న శోభాయాత్రకు అనుమతి నిరాకరించగా.. 16న ఆయనకు ఈ నోటిస్ అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించి తీరతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు.




అనుమతి నిరాకరణపై రాజాసింగ్ ఏమన్నారంటే..
శ్రీరామనవమి శోభయాత్ర నిర్వహణకు తాను దాదాపు 45 రోజుల ముందే అనుమతి కోరినట్లు తెలిపారు. చాలా రోజుల కిందటే పర్మిషన్ కోసం లేఖ ఇస్తే ఇప్పుడు నిరాకరించడం ఏంటని, ఇన్ని రోజులు ఏం చేశారని రాజా సింగ్ ప్రశ్నించారు. ఒకే శోభాయాత్రకు పర్మిషన్ ఇస్తామని పోలీసులు అంటున్నారు. తాను 2010 నుంచి లోధ్ భవన్ నుంచి ఆకాష్ పురి టెంపుల్ వరకు  శోభాయాత్ర నిర్వహిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువులకు సంబంధించిన శోభాయాత్రలు, వేడుకల్ని అడ్డుకుంటుందని తమకు ముందే తెలుసునన్నారు. కేరళలోనూ హిందూ పండుగల సమయంలో హిందువులపై, నిర్వాహకులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు పోలీసులపై ఒత్తిడి చేసి హిందువులపై ఇలాంటి సమయంలో కేసులు బనాయించిందన్నారు.


గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ తాను కార్పొరేటర్ గా ఉండగా తనపై ఫేక్ కేసులు నమోదు చేస్తే కూడా భయపడలేదన్నారు. రేపు (ఏప్రిల్ 17న) తాను మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభించి తీరుతానని, ఎవరూ ఆపలేరంటూ రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి హిందువులపై దౌర్జన్యం చేస్తే, హిందూ పండుగలు ఆపాలని చూస్తే.. గతంలో సీఎంలకు ఏం జరిగిందే మీ పరిస్థితి అలాగే అవుతుందని హెచ్చరించారు.


శ్రీరాముడి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు 
ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర వేడుకగా నిర్వహించనున్నారు. శోభాయాత్ర కోసం నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బుధవారం నాడు ఉదయం 11 గంటలకు శోభాయాత్ర ప్రారంభం అవుతుందని సీపీ తెలిపారు. శ్రీరాముడి ప్రధాన ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుంచి రామకోటిలోని హనుమాన్ వ్యాయామ శాల స్కూల్ వరకు జరగనుంది.