Hyderabad Traffic News: ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో సీతారాముల శోభాయాత్ర జరగనుంది. ఈ యాత్ర కోసం వవివిధ మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 17 బుధవారం నాడు ఉదయం 11 గంటలకు రాముడి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. సీతారామ్ బాగ్ టెంపుల్, మంగళ్ హాట్ నుంచి హనుమాన్ వ్యాయామశాల, సుల్తాన్ బజార్ వరకూ శోభాయాత్ర ఉంటుందని తెలిపారు. కాబట్టి, యాత్ర పూర్తయ్యే వరకూ ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ను అనుమతించబోమని.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈ ప్రాంతాల మీదుగా యాత్ర
రాముడి ప్రధాన ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుంచి రామకోటిలోని హనుమాన్ వ్యాయామ శాల స్కూల్ వరకు జరగనుంది. ఈ యాత్ర బోయిగూడ కమాన్, జాలి హనుమాన్, మంగళ్ హాట్ పీఎస్ రోడ్, పురాణాపూల్, గాంధీ విగ్రహం, ధూల్పేట్, చుడిబజార్, బేగంబజార్, జుమ్మేరాత్ బజార్, బేగం బజార్ చత్రి, బర్తన్ బజార్, శంకర్ షేర్ హోటల్, గురుద్వారా, సిద్ధి అంబర్ బజార్, గౌలిగూడ చమన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్, కోఠీల మీదుగా శ్రీరామ శోభయాత్ర సాగుతుంది. ఈ మార్గంలో ప్రధాన శోభాయాత్రలో చుట్టుపక్కల నుంచి వచ్చే చిన్న చిన్న ఊరేగింపులు వివిధ పాయింట్ల వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.
శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లుగా నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా.. ముందస్తుగా వివిధ పాయింట్ల వద్ద వాటిని డైవర్ట్ చేయనున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల గుండా ప్రయాణించే వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.