హైదరాబాద్ పోలీసు విభాగంలో పని చేస్తున్న ఇద్దరు ఎస్సైలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న క్రమంలో పోలీస్ స్టేషన్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం విమర్శలపాలు అయిన సంగతి తెలిసిందే. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా ఉన్న భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషన్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అనుమతితో పెళ్లికి ఒప్పించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరిదీ ఒకే డిపార్ట్‌మెంట్, ఒకే స్టేషన్ కావడంతో ప్రీ వెడ్డింగ్ షూట్‌లోని కొంత భాగం తమ పోలీస్ స్టేషన్‌ని వాడుకున్నారు. అంతేకాక పోలీసుల వాహనాలను కూడా ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వాడుకున్నారు.


ఇది నెట్టింట్లో ప్రత్యక్షం కావడంతో దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. వారు చేసిన పని కొంత మందికి తప్పుగా అనిపించినప్పటికీ, తనకు అందులో తప్పేమీ కనిపించడం లేదని అన్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వారు తమను సంప్రదించినా పర్మిషన్ ఇచ్చి ఉండేవాళ్లమని ఎక్స్ లో పోస్ట్ చేశారు.


‘‘నేను ఈ వీడియోకి సంబంధించి మిశ్రమ స్పందనలను చూశాను. నిజాయితీగా చెప్పాలంటే, వారు తమ పెళ్లి విషయంలో కాస్త ఎక్కువ ఉన్నారు. ఇంకా అదో గొప్ప విషయం, కానీ కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. పోలీసింగ్ అనేది చాలా చాలా కఠినమైన పని.. ముఖ్యంగా మహిళల విషయంలో. అయితే, ఆమె పని చేస్తున్న డిపార్ట్‌మెంట్‌లోనే ఆమె తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఒక మంచి విషయం. ఇద్దరు పోలీసు అధికారులు, పోలీసు డిపార్ట్‌మెంట్ వస్తువులు, గుర్తులను ఉపయోగించడాన్ని నేను తప్పుగా భావించడం లేదు. వారు మాకు ముందే తెలియజేసి ఉండి, అనుమతి కోరి ఉంటే మేం కచ్చితంగా షూట్‌కి పర్మిషన్ ఇచ్చి ఉండేవాళ్లం. దీనిపై మనలో కొందరికి కోపం రావచ్చు. వారు తమ పెళ్లికి నన్ను పిలవలేదు, అయినా నేను వారిని కలిసి, వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే, సరైన అనుమతి లేకుండా దీన్ని మరెవరూ రిపీట్ చేయవద్దని నేను కోరుతున్నాను’’ అని సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.






పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా భావన అనే యువతి పనిచేస్తున్నారు. అదే స్టేషన్ లో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్న రావూరి కిషన్ కూడా పని చేస్తున్నారు. కొంత కాలంగా వీరు ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెండ్లికి కూడా సిద్ధం అయ్యారు. పెళ్లికి ముందు జరుపుకునే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పోలీస్ స్టేషన్ నే వేదికగా చేసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అది కూడా యూనిఫామ్ లోనే వీడియో షూట్ చేశారు. పైగా పోలీస్ వాహనంతో వెడ్డింగ్ షూట్ చేశారు. మూడు సింహాల బొమ్మను, యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్, బెల్ట్ బకెట్ వంటివి కూడా ప్రీ వెడ్డింగ్ షూట్‌లో భాగం చేసేశారు. ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ని ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్‌కి వాడుకోవడం విపరీతంగా విమర్శల పాలు అవుతోంది.