Hyderabad Police: వినాయక వేడుకలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ అన్నారు. ఈ నెల 18న ప్రారంభం కానున్న గణేశ్‌ ఉత్సవాలకు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పండుగ వేళ ఎక్కడ కూడా చిన్న పొరపాటుకు తావు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. 


గణేశ్‌ విగ్రహాల ప్రతిష్ఠాపన విషయంలో నిర్వాహకులతో ఇన్‌స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లను సమీక్షించాలన్నారు. వేడుకల్లో ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యలు రానివ్వద్దని సూచించారు. ఈ విషయంలో అందరూ సమష్టిగా కృషిచేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని పౌర విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గణేష్ ఉత్సవ కమిటీలు సహకరించాలని కోరారు.


అన్ని శాఖల సమన్వయం అవసరం
ఉత్సవాలను ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఘనంగా నిర్వహిస్తారని కమిషనర్ అన్నారు. ఉత్సవాల్లో ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు కలకగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, నీటి పారుదల, వైద్య, విద్యుత్‌, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమష్టిగా పనిచేస్తూ గణేశ్‌ వేడుకలు, నిమజ్జనోత్సవాన్ని విజయవంతం చేయాలని సీపీ సూచించారు. 


భక్తుల మనోభావాలు దెబ్బతినేలా నడుచుకోవద్దని సూచించారు. పోలీసులంటే గౌరవం పెరిగేలా ప్రవర్తించాలన్నారు. నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ఉంటూ, శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇన్‌స్పెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. డయల్‌ 100కు వచ్చే కాల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీసీ టీవీలు, విజుబుల్‌ పోలీసింగ్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.


మండపాల్లో 10 గంటల వరకే స్పీకర్లు
గణేష్ మండపాల వద్ద సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను మండపాల నిర్వాహకులకు వివరించాలని సీపీ సూచించారు. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని, ఆవిషయాన్ని మండపాల నిర్వాహకులకు సూచించాలన్నారు. మండపాల వద్ద రోజంతా కనీసం ఒక వలంటీర్‌ ఉండే విధంగా నిర్వాహకులు ప్లాన్‌ చేసుకోవాలని, భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకొని మండపాలలో క్యూలైన్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. 


సోషల్ మీడియాపై నిఘా
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మండపాల్లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా నాణ్యత గల విద్యుత్‌ వైర్లను ఉపయోగించేలా నిర్వాహకుల్లో అవగాహన కల్పించాలని సీపీ సూచించారు. మండపాల వద్ద నిర్వాహకుల ఫోన్‌ నంబర్లుతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించాలని, ప్రతి మండపం వద్ద పాయింట్‌ బుక్‌ ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులపై నిఘా ఉంటుందని,  సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని సీపీ ప్రజలను కోరారు. 


గణేశ్‌ శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు, స్విమ్మర్స్‌, క్రేన్లు, లైటింగ్స్‌, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జనం చేసే చెరువు కట్టల వద్ద ఆయా శాఖలతో కలిసి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.