Hyderabad Airport Metro Express: హైదరాబాద్ ప్రజలకు మరో గుడ్ న్యూస్. మెట్రో సేవలను ఎయిర్ పోర్ట్ వరకు పొడిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెట్రో పనులను కార్యరూపం దాల్చనున్నాయి. విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో పనులను క్షేత్రస్థాయిలో మొదలెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారంలో పనులు మొదలయ్యే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రాయదుర్గం నుంచి 31 కిలోమీటర్లు మెట్రో లైన్ నిర్మించాలని ప్రభుత్వం భావించింది. 13వ తేదీ పనులు ప్రారంభంచేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. అయితే ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనకు వెళ్లడంతో పనులు ప్రారంభం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. మంత్రి విదేశీ పర్యటన ముగిస్తే విమానాశ్రయ మెట్రో పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 


ఈ నెలలోనే ప్రారంభం
విమానాశ్రయ మెట్రో పనులను ప్రారంభించడం,  సైక్లింగ్‌ ట్రాక్‌ ప్రారంభోత్సవం కార్యక్రమాలు ఈ నెలలోనే ఉండనున్నాయి. విమానాశ్రయ మెట్రో రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ. పనులకు గతేడాది డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ పద్ధతిలో గ్లోబల్‌ టెండర్లను పిలిచారు. రెండు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ఎల్‌1గా నిలిచిన సంస్థ వివరాలతో ప్రభుత్వానికి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) నివేదిక సమర్పించింది.


ప్రభుత్వ ఆమోదం తరువాత సంస్థ పేరు వెల్లడి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో పనులకు నెలన్నర క్రితమే టెండర్‌ ప్రక్రియ ముగిసింది. రెండు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎల్‌1గా నిలిచిన సంస్థను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపినట్లు అధికారులు చెబుతున్నారు. సర్కార్ నుంచి ఆమోదం వచ్చిన వెంటనే సదరు సంస్థ అనంతరం విమానాశ్రయ మెట్రో పనులను చేడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌ అయినప్పటికీ కేంద్రం నుంచి కూడా సూత్రప్రాయ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది.


మెట్రో డిపో కోసం 48 ఎకరాలు
విమానాశ్రయంలో ఎక్స్‌ప్రెస్‌ మెట్రో డిపోను నిర్మించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  ఇందుకోసం అవసరమైన 48 ఎకరాలను మెట్రోరైలు సంస్థకు అప్పగించాలని మంత్రి కేటీఆర్ గత నెలలో జీఎంఆర్‌ను ఆదేశించారు. ఈ మేరకు జీఎంఆర్‌ సంస్థ ఇటీవలనే ఆ భూమిని మెట్రోకి అప్పగించింది. దీంతో అధికారులు మెట్రో పనులపై కసరత్తు చేస్తున్నారు. డిపో డిజైన్‌ రూపొందించే పనిలో పడ్డారు. మెట్రో ప్రాజెక్ట్‌ దక్కించుకున్న సంస్థ డిజైన్ ప్రకారం నిర్మాణం చేపట్టనుంది.


భవిష్యత్ అవసరాల దృష్ట్యా మెట్రో తప్పనిసరి
హైదరాబాద్ ఐటీ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతోంది. ఈ క్రమంలో భారీ నిర్మాణాలు వెలిశాయి. రవాణా మార్గాలు ఉన్నాయి. అయితే ఎయిర్ పోర్ట్‌కు వెళ్లడానికి సరైన రవాణా లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. భవిష్యత్తులో ఈ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో లైన్ తప్పనిసరి అని సీఎం కేసీఆర్ భావించారు. విమానాశ్రయంతో నగరానికి మెట్రో అనుసంధానం చేయాలోచించారు.


అందులో భాగంగానే ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రో పొడిగించాలని సూచించారు. ఈ మేరకు 2018-19లో ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) రూపొందించింది.  రెండేళ్ల తరువాత ప్రభుత్వం డీపీఆర్‌కు ఆమోదం తెలిపింది. గతేడాది శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది టెండర్ల ప్రక్రియ ముగిసింది. నిర్మాణ పనులు మొదలెట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఐదేళ్లు పట్టింది.