ఈ మధ్య పండుగల విషయంలో కాస్త సందిగ్ధత నెలకొంటూ ఉంది. క్యాలెండర్‌లో ఉన్న తేదీ కాకుండా కొంత మంది పండితులు ఆ మరుసటి రోజును జరుపుకోవాలని చెబుతుండడం కాస్త తికమకగా ఉంటుంది. మొన్న రాఖీ పూర్ణిమ విషయంలోనూ క్యాలెండర్‌లో ఉన్న తేదీ, అసలు ముహూర్త సమయాలు తేడాగా ఉన్నాయి. తాజాగా వినాయక చవితి విషయంలో కూడా ఇలాంటి సందిగ్ధతే నెలకొని ఉంది. అయితే, తాజాగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ పండుగ ఎప్పుడనే విషయంపై స్పష్టత ఇచ్చింది.


18నే పండుగ, భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ వెల్లడి


ఈ నెల 18వ తేదీనే వినాయక చవితి పండుగ అని భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ పేర్కొంది. అలాగే 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని తెలిపింది. అంతకు ముందు 19న వినాయక చవితి, 29న నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ప్రకటించింది. అయితే, ఈసారి తిథి రెండు రోజులు ఉండడం వల్ల.. పండుగ ఎప్పుడనే దానిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో శృంగేరి - కంచి పీఠాధిపతులు గణేష్‌ ప్రతిష్ట 18వ తేదీనే చేసుకోవాలని సూచించారని వివరించారు. కాబట్టి, గ్రేటర్‌ పరిధిలోని మండపాలు 18వ తేదీనే వినాయక చవితి నిర్వహించుకోవాలని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సూచించింది.


వినాయక చవితి పండుగ జరుపుకునే విషయంపై కాణిపాకం దేవాలయ అర్చకులు కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 18వ తేదీన వినాయక చవితి నిర్వహించుకోవాలని కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయ అర్చకులు చెబుతున్నారు. వినాయక చవితి సమీపిస్తుండడం వల్ల నగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్‌పేటతోపాటు కూకట్‌పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్‌బీనగర్, హయత్‌ నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టి విగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. కొత్తపేట చౌరస్తాలో ఇలా రోడ్డు పక్కన మట్టివిగ్రహాలు ఉంచి విక్రయిస్తున్నారు. ఖైరతాబాద్‌ విగ్రహం కూడా తుది మెరుగులు దిద్దుకుంటూ ఉంది.