వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎపిసోడ్‌పై పోలీసులు రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ సీపీ సీవీఆనంద్ మాట్లాడుతూ సచివాలయం, సిట్ ఆఫీస్‌కు వెళ్లి ఏదైనా హడావుడి చేయాలని షర్మిల ప్లాన్ చేశారని అన్నారు. అందుకే ముందస్తు సమాచారంతో ఆమెను హౌస్ అరెస్టు చేసేందుకు యత్నించామన్నారు. గతంలో ఆమె చేసిన చర్యలు కారణంగానే ఇప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడించారు.


రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం పోలీసుల బాధ్యత అని అన్నారు సీవీ ఆనంద్. అందులో భాగంగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. షర్మిల విషయంలో కూడా అదే జరిగిందని పేర్కొన్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌పై దాడి కేసులో పూర్తి విచారణ జరుగుతుందని వివరించారు. 


అంతకంటే ముందు మాట్లాడిన డీసీపీ జోయల్ డెవిస్‌... ఎస్సైను షర్మిల కొట్టారన్నారు. ఎస్సై ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే కేసు రిజిస్టర్ చేసినట్టు కూడా వెల్లడించారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం పద్దతి కాదని చట్టం ప్రకారం చర్యలు ఉంటాయన్నారాయన.