Hyderabad Crime News: హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో తవ్వే కొద్ది విస్తుపోయే విషాయాలు వెలుగులోకి వస్తున్నాయి. బయట వ్యక్తులకు అనుమానం రాకుండా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కోడ్ భాషలో మాట్లాడుకొని రేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత పిల్లలను ఆయా వ్యక్తులకు ఇచ్చే వాళ్లు. ఇలా ముక్కుపచ్చలారని చిన్నారులను కన్నవారి దగ్గర నుంచి మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
కోట్లలో బిజినెస్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన చిన్నపిల్లల అమ్మకాల దందా కేసు చిన్నది కాదు. వీళ్లకు భారీ స్థాయిలో నెట్ వర్క్ ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో చిన్నారులను తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ఈ కేసులో కేంద్రబిందువుగా ఉన్న ఆర్‌ఎంపీ శోభారాణి మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్ తిన్నారు. తన ఇల్లు, క్లినిక్‌ను కేంద్రంగా చేసుకొని కోట్ల బిజినెస్ చేశారామె. కాసుల ఆశ చూపి కన్నవారికి, పిల్లల ఆశ చూపి కొన్న వారిని నిలువునా ముంచేసింది.
కోడ్ లాంగ్వేజ్‌లో దందా
పిల్లల విక్రయం అంత ఆషామాషీగా చేయలేదు శోభారాణి. ఎక్కడిక్కడ తన ముఠా సభ్యులను పెట్టుకొని నడిపించారు. దీనికోసం ఓ కోడ్ లాంగ్యేజ్‌ను కూడా ఉపయోగించారు. బైక్ అంటే బాబు అని అర్థం. ఆడపిల్ల కావాలంటే స్కూటీ కావాలని అడగాలట. అది కూడా ఎవరి వెళ్తే వాళ్లకు ఈ విషయాలు చెప్పరు. తెలిసిన వారి ద్వారానే వెళ్లాలి అప్పుడే గుట్టు వీడుతుంది.
స్వచ్ఛంద సంస్థ స్టింగ్ ఆపరేషన్
ఈ దందాను వెలుగులోకి తీసుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ అదే పని చేసింది. ఆ టీంలోని ఓ మహిళ తమకు తెలిసిన వారికి బిడ్డ కావాలంటూ అప్రోచ్ అయ్యారు. నిజంగానే వీళ్లకు అవసరం ఉందని అనుకున్నప్పుడే శోభారాణి లైన్‌లోకి వచ్చారు. అప్పటి వరకు ఎక్కడ కూడా చిన్నారుల ప్రస్తావన రాకుండానే బేరాలు సాగాయి. బైక్ కావాలంటై ఏడు లక్షలు ఇవ్వాలని... స్కూటీ కావాలంటే ఆరు లక్షలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పారామె.
ఇంట్లో బంధించిన ముఠా
అన్ని అనుకున్న తర్వాత అడ్వాన్స్ కింద 20 వేలు అడిగారు. వాళ్లు మాత్రం పది వేలు ఆన్‌లైన్ పంపించారు. దీంతో నమ్మకం కుదిరిన తర్వాత శోభారాణి ఇంటికి పిలిచి పాపను అప్పగించింది. ఆ పాపకు సంబంధించిన వారెవరూ అక్కడ లేరు. అన్ని వివరాలు గుచ్చి గుచ్చి అడుగుతుంటే స్వచ్ఛంద సంస్థ సిబ్బందిని గదిలో పెట్టి బంధించింది శోభారాణి. ఇవన్నీ స్టింగ్ ఆపరేషన్‌లో బహిర్గతం అయ్యాయి.
అంత కంటే ముందే శోభారాణి ఇంటిని చుట్టుముట్టిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు. చివరకు అసలు విషయాన్ని పోలీసులకు చెప్పి గుట్టు విప్పారు. అయితే ఒక్క చిన్నారిని రక్షించినట్టు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అనుకున్నారు. కానీ శోభారాణి ఆమెతో ఉన్న ఇతర నిందితులను విచారిస్తే మరో 50 మంది వరకు విక్రయించినట్టు పేర్కొన్నారు.
శోభారాణి అండ్ ముఠా చెప్పే విషయాలు విన్న పోలీసులు షాక్ తిన్నారు. 50 మందిలో 16 మంది చిన్నారుల వివరాలు చెప్పారు. వాళ్లంతా హైదరాబాద్ చుట్టుపక్కల, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందు అందర్నీ రప్పించారు. చిన్నారులను స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా దత్తత తీసుకున్న దంపతులపై కూడా కేసులు పెట్టారు. ఇలా కేసులు పెట్టడంతోపాటు ఇన్నాళ్లు పెంచుకున్న చిన్నారులను తీసుకెళ్లిపోవడంతో వారంతా బోరున విలపించారు.
చిన్నారులను కన్నవారి వివరాలు దొరికితే వాళ్లకు అప్పగించాలని లేకుంటే ఇప్పటికే పెంచుకుంటున్న వారికి ఇచ్చేయాలని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అభ్యర్థిస్తున్నారు. దీనికి అవసరమైన ప్రక్రియను అనుసరించి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే పిల్లలు మళ్లీ అనాథలు అవుతారని అంటున్నారు.