Telangana Crime News: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా యాక్టివిటీస్‌ ఇతర్రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు పోలీసుసు అనుమానిస్తున్నారు. ఆ దిశగా రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంకా ఏ ఏ రాష్ట్రాల్లో ఈ ముఠా కార్యకలాపాలు చేపట్టిందో ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఓ బృందం ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. 


ప్రధాన నిందితుల కోసం వేట


చైల్డ్‌ ట్రాఫిక్ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన నిందితులు ఇచ్చిన సమాచారంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో కిరణ్, ప్రీతిదే కీలక పాత్రగా అనుమానిస్తున్నారు. వాళ్ల కోసం వేట మొదలు పెట్టారు. 50 మందికిపైగా చిన్నారులను విక్రయించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వీరిలో 16 మందిని గుర్తించారు. ఇంకా మిగతా వారి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. 


పెంచుకున్న పేరెంట్స్‌పై కేసులు 


ఈ కేసులో పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులపై కేసులు పెట్టడం ఇక్క మరో ట్విస్టు. దీంతో ఆ ఫ్యామిలీలు బోరున విలపిస్తున్నాయి. తెలిసో తెలియకో పిల్లలు లేరని బెంగతోనో చిన్నారులను కొనుక్కున్నామని వాపోతున్నారు. ఇన్ని రోజులు పెంచుకున్న మమకారంతో వారిని విడిచి పెట్టలేక పోలీస్టేషన్ వద్దే కన్నీరు మున్నీరుగా విలపించారు. తాము ఆ బిడ్డల్ని కనకపోయినా కడుపులో పెట్టుకొని అంతకంటే ఎక్కువగా పెంచుకున్నామని అంటున్నారు. ప్రాణానికి ప్రాణంగా  పెంచుకున్న చిన్నారులను దూరం చేయొద్దని వేడుకుంటున్నారు. 


దత్తత తీసుకోవాలంటే ప్రత్యేక రూల్స్ 


సంతానం లేక ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీలు పిల్లల కోసం లక్షలు వెచ్చించారు. ఏదో రూపంలో ఇంట్లోకి పిల్లలు వస్తున్నారన్న ఆనందంతో తప్పులు చేస్తున్నారు. పిల్లల్ని ఇలా దత్తత తీసుకోవాలంటే దానికో నియామవళి ఉంది. అప్పుడే అధికారులు దాన్ని గుర్తిస్తారు. ఇలా ఎవరి వద్ద పడిదే వాళ్ల వద్ద కొంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. ఇలా పిల్లల్ని కొనుగోలు చేస్తున్న వారిలో చాలా మంది ఆర్థికంగా కూడా అంతంత మాత్రంగానే ఉన్నవాళ్లు ఉన్నారు. ఇలాంటి వాళ్లు కూడా అప్పులు చేసి డబ్బులు చెల్లించి పిల్లల్ని కొంటున్నారు. 


ఇలాంటి ముఠాల్లో ఆర్ఎంపీలు, ఆసుపత్రుల్లో పని చేసే సిబ్బంది పాత్ర ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కేసులో కూడా నిందితులుగా ఆరఎంపీలు, ఇతర ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. శోభారాణి అనే ఆర్‌ఎంపీ ఈ విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించి చెక్ పెట్టారు.